కైరో : గాజాపై ఇజ్రాయిల్ అమానుష దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలోని మూసా బిన్ నుసైర్ పాఠశాలతో పాటు పలు చోట్ల ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడుల్లో 17 మంది పాలస్తీనియన్లు మరణించారు. ఆస్పత్రిని కూడా ఖాళీ చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు పాలస్తీనా వైద్య సిబ్బంది తెలిపింది.
గాజా నగరంలో నిరాశ్రయులైన కుటంబాలకు ఆశ్రయం కల్పిస్తున్న మూసాబిన్ నుసైర్ పాఠశాలపై జరిపిన దాడిలో చిన్నారులతో పాటు ఎనిమిది మంది మరణించారని పేర్కొంది. గాజాలోని ఓ కారుపై జరిపిన దాడిలో నలుగురు మరణించగా, గాజాకు దక్షిణాన రఫా, ఖాన్ యూనిస్‌లపై జరిపిన వేర్వేరు వైమానిక దాడుల్లో సుమారు ఐదుగురు మరణించారని తెలిపింది.
ఉత్తర గాజాలోని జబాలియా శిబిరానికి సమీపంలో బీట్ లాహియా, బీట్ హనౌన్‌లలో అక్టోబర్ నుండి ఇజ్రాయిల్ సైన్యాన్ని మోహరించిన సంగతి తెలిసిందే. ఆస్పత్రిని ఖాళీ చేయాల్సిందిగా, రోగులను మరో ఆస్పత్రికి తరలించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు కమల్ అద్వాన్ హాస్పిటల్ డైరెక్టర్ హుస్సామ్ అబు సఫియా పేర్కొన్నారు. అంబులెన్స్‌లు అందుబాటులో లేనందున రోగులను తరలించడం అసాధ్యమని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలలో హమాస్ ఉగ్రవాదులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని, తమ సైనికులపై దాడులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని ఇజ్రాయిల్ ఆర్మీ ఆరోపించింది.