EU: మద్యం దిగుమతులపై 200 శాతం పన్ను

Mar 13,2025 20:48 #Donald Trump, #European Union

ఈయూకు ట్రంప్‌ హెచ్చరిక

వాషింగ్టన్‌ : షాంపైన్‌, వైన్‌ సహా అన్ని రకాల మద్యం దిగుమతులపై 200 శాతం పన్ను విధిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఫ్రాన్స్‌, ఇతర యూరోపియన్‌ యూనియన్‌ దేశాలను హెచ్చరించారు. అమెరికా విస్కీపై యూరోపియన్‌ యూనియన్‌ 50 శాతం సుంకాన్ని విధిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ హెచ్చరికలు చేశారు. ‘యూరోపియన్‌ యూనియన్‌ అధికారులు ప్రపంచంలోనే అత్యంత శతృవులుగా వ్యవహరిస్తూ అవమానకరంగా పన్నులు వేస్తున్నారు. అమెరికాను దెబ్బతీయడమే వారి ఏకైక లక్ష్యం. విస్కీపై యాభై శాతం సుంకాన్ని వసూలు చేస్తున్నారు. దీనిని తక్షణమే తొలగించకపోతే మేము కూడా ఫ్రాన్స్‌, ఇతర యూరోపియన్‌ యూనియన్‌ దేశాల నుండి వస్తున్న అన్ని రకాల వైన్స్‌, షాంపైన్లు, ఆల్కహాల్‌ ఉత్పత్తులపై త్వరలోనే 200 శాతం సుంకం వేస్తాం. ఇది అమెరికా వైన్‌-షాంపైన్‌ వ్యాపారానికి ఎంతో మంచిది’ అని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్రూత్‌ సోషల్‌లో ఓ పోస్ట్‌ పెట్టారు.
కాగా అమెరికా నుండి దొంగిలించిన సంపదను తిరిగి స్వాధీనం చేసుకుంటామంటూ ట్రంప్‌ చేసిన ప్రకటనపై యూరప్‌, కెనడా తీవ్ర స్థాయిలో స్పందించాయి. ఒకవేళ అమెరికా 28 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన సుంకాలు విధిస్తే మేము కూడా అదే స్థాయిలో వసూలు చేస్తామని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షుడు వాన్‌ డర్‌ లేయాన్‌ స్పష్టం చేశారు. కేవలం స్టీల్‌, అల్యూమినియం ఉత్పత్తుల పైనే కాకుండా వస్త్రాలు, గృహోపకరణాలు, వ్యవసాయ వస్తువులపై కూడా ఏప్రిల్‌ 1 నుండి పన్నులు ఉంటాయని అసోసియేట్‌ ప్రెస్‌ తెలిపింది.

➡️