గత ఏడాది మే9న జరిగిన అల్లర్లలో 25మంది పౌరులకు జైలు శిక్ష

Dec 22,2024 00:03 #courts, #judgment, #Pakistan Military
  • పాక్‌ మిలిటరీ కోర్టుల తీర్పు

ఇస్లామాబాద్‌ : గతేడాది మే 9న అంటే మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్టు అనంతరం చెలరేగిన అల్లర్లకు సంబంధించిన కేసుల్లో 25మంది పౌరులకు పాకిస్తాన్‌ మిలటరీ కోర్టులు శిక్షలు విధించాయి. అల్లర్ల సందర్భంగా మిలటరీ స్థావరాలపై దాడులకు పాల్పడినందుకు వీరికి రెండు నుండి పదేళ్ల పాటు జైలు శిక్ష విధించినట్లు ఆర్మీ శనివారం ప్రకటించింది. 2023 మే 9న తెహ్రీక్‌ ఇ ఇన్సాఫ్‌ (పిటిఐ) మద్దతుదారులు రావల్పిండిలోని ఆర్మీ హెడ్‌ క్వార్టర్స్‌, ఫైసలాబాద్‌లోని ఐఎస్‌ఐ భవనంతో సహా పలు మిలటరీ స్థావరాలపై దాడులు జరిపారు. అవినీతి కేసులో తమ నేతను అరెస్టు చేసినందుకు వారు ఆగ్రహంతో ఈ దాడులకు దిగారు.
దేశంలో పలు ప్రాంతాల్లో రాజకీయ ప్రేరేపిత హింసాకాండ చెలరేగిందని, ఇది పాకిస్తాన్‌ చరిత్రలో ఓ చీకటి అధ్యాయమని మిలటరీ ఒక ప్రకటనలో పేర్కొంది. మొదటి దశలో 25మందికి శిక్షలు విధించామని, మిగిలిన వారిపై ఇంకా విచారణ జరుగుతోందని, అవి కూడా త్వరలో ప్రకటిస్తామని ఆ ప్రకటన తెలిపింది. వీరిలో 14మందికి పదేళ్ళ పాటు శిక్ష విధించారు.

➡️