30 రోజుల కాల్పుల విరమణ!

  • రష్యాతో తక్షణమే చర్చలు
  • జెడ్డా సమావేశంలో అమెరికా ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకారం

జెడ్డా : రష్యాతో తక్షణమే చర్చలు జరిపేందుకు, అలాగే 30 రోజుల పాటు కాల్పుల విరమణకు అమెరికా చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించింది. జెడ్డాలో మంగళవారం ఉక్రెయిన్‌, అమెరికా మధ్య జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. వైట్‌హౌస్‌లో ట్రంప్‌, జెలెన్‌స్కీ ఘర్షణ పడిన అనంతరం జరిగిన మొట్టమొదటి ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కీవ్‌కు మిలటరీ సాయాన్ని పునరుద్ధరించేందుకు అమెరికా అంగీకారం తెలిపింది. సాధ్యమైనంత త్వరలో ఉక్రెయిన్‌ ఖనిజాలపై కూడా ఒప్పందం కుదుర్చుకుందామని వారు భావించారు. ఈ మేరకు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. తాము చేసిన ప్రతిపాదనకు ఉక్రెయిన్‌ అంగీకరించిందని, ఈ విషయాన్ని రష్యాకు కూడా తెలియచేస్తామని, వారు కూడా శాంతి స్థాపనకు అంగీకరిస్తారని భావిస్తున్నామని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్‌ రూబియో చెప్పారు. అమెరికా ప్రతిపాదనను వెంటనే అమల్లోకి తీసుకురావడానికి ఉక్రెయిన్‌ సంసిద్ధతను వ్యక్తం చేసిందని ఆ ప్రకటన పేర్కొంది. కాల్పుల విరమణ అనేది రష్యా సమాఖ్య ఆమోదానికి, అమలుకు లోబడి వుంటుందని ప్రకటన పేర్కొంది. రష్యా స్పందనే ఇప్పుడు కీలకమని పేర్కొంది. జాతీయ భద్రతా సలహాదారు మైక్‌ వాల్జ్‌ మాట్లాడుతూ, ఈ ప్రతిపాదనపై రష్యాతో తాను మాట్లాడనున్నట్లు చెప్పారు. యుద్ధాన్ని ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ప్రశ్న అని ఆయన వ్యాఖ్యానించారు. శాంతి నెలకొల్పేందుకు చేయగలిగినదంతా చేయడానికి తాము సిద్ధంగా వున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడి చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ ఆండ్రీ యార్మార్క్‌ మంగళవారం సమావేశానికి ముందు విలేకర్లతో వ్యాఖ్యానించారు.

జెడ్డాలో చర్చలు జరగడానికి ముందు రోజు డ్రోన్‌లతో కీవ్‌ విరుచుకుపడడాన్ని ప్రస్తావిస్తూ, ఈ దాడుల వల్ల శాంతిచర్చలు పట్టాలు తప్పాయని భావిస్తున్నారా అని ప్రశ్నించగా, అసలు చర్చలే ఇంకా ప్రారంభం కాలేదు, కాబట్టి పట్టాలు తప్పడమనే ప్రశ్నే లేదని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్ర పెస్కోవ్‌ వ్యాఖ్యానించారు.

ప్రతిపాదిత పాక్షిక కాల్పుల విరమణపై రష్యా వైఖరి గురించి వ్యాఖ్యానించడానికి కూడా ఆయన తిరస్కరించారు. ఈ సమయంలోనే వాటి గురించి మాట్లాడడం సాధ్యం కాదన్నారు. శాంతిని నెలకొల్పేందుకు ఉక్రెయిన్‌ ఏ మేరకు సిద్ధంగా వుందో అమెరికా చెప్పిన తర్వాతే తెలుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా, ఉక్రెయిన్‌ రూపొందించిన ఈ ప్రతిపాదనకు రష్యా కూడా సమ్మతిస్తుందని ఆశిస్తున్నట్లు ట్రంప్‌ మంగళవారం పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మొత్తంగా కాల్పుల విరమణ జరగగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.

➡️