- కమల్ అద్వాన్ ఆస్పత్రిపై ఆగని దాడులు
- లెబనాన్‌లో 16మంది మృతి
- తుడిచిపెట్టుకుపోయిన 37 లెబనాన్ పట్టణాలు
గాజా/ బీరుట్ : గాజావ్యాప్తంగా ఇజ్రాయిల్ సాగిస్తున క్రూరమైన దాడుల్లో గత 24 గంటల్లో 33మంది మరణించారు. మరో 86మంది గాయపడ్డారు. ప్రధానంగా ఉత్తర గాజాలోని బెయిట్ లాహియా పట్టణంలో 20మంది చనిపోయారు. ఆ ప్రాంతంలో పాక్షికంగా పనిచేస్తున్న కమల్ అద్వాన్ ఆస్పత్రిపై మళ్లీ దాడులు జరిగాయి. ఇప్పటికే నీరు, మందులు లేకుండా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న ఆస్పత్రిలో పిల్లల వార్డుపై ఇజ్రాయిల్ జెట్‌లు, డ్రోన్‌లతో దాడి జరిపిందని, వైద్య సిబ్బంది, రోగులు కూడా తీవ్రంగా గాయపడ్డారని ఆస్పత్రి డైరెక్టర్ ఈద్ సాబా తెలిపారు. ఈ దాడిలో ఆస్పత్రి పై అంతస్తులు బాగా దెబ్బతిన్నాయని, గాయపడిన వారిలో నవజాత శిశువులు కూడా వున్నారని ఆయన తెలిపారు. ఆస్పత్రిపై వరుసగా రెండు రోజుల నుండి దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయిల్ దాడుల్లో గాజా నగరంలో నలుగురు, సెంట్రల్ ఏరియాలో ఆరుగురు, ఖాన్ యూనిస్ నగరంలో ముగ్గురు చనిపోయారు. ఇప్పటివరకు గాజావ్యాప్తంగా మొత్తం 43,391మంది మరణించగా, 1,02,347మంది గాయపడ్డారు. బెయిట్ లాహియాలో జరిగిన దాడుల్లో 13మంది చిన్నారులు మరణించారు. ఆ ప్రాంతం నుండి ఖాళీ చేయాలని ఆదేశాలు జారీ అయిన నేపథ్యంలో దాడులు జరిగాయి.
మరోవైపు లెబనాన్‌పై కొనసాగుతున్న దాడుల్లో సోమవారం 16మంది మరణించగా, 90మంది గాయపడ్డారు. టైర్, బింట్ జెబియల్ జిల్లాల్లోని గ్రామాలపై దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు లెబనాన్‌లో 3,002మంది మరణించారు. 13,492మంది గాయపడ్డారు. ఈ దాడుల్లో దక్షిణ లెబనాన్‌లో 37 పట్టణాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని లెబనాన్ జాతీయ వార్తా సంస్థ తెలిపింది. 40వేలకు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయని పేర్కొంది.
గాజాకు యుఎన్‌ఆర్‌డబ్ల్యుఎ అందించే సాయం నిలిచిపోతే అక్కడ వున్న ప్రజలు కరువు కాటకాలతో అలమటించిపోతారని ఆ సంస్థ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ జూలియట్ టూమా హెచ్చరించారు.