గాజా సిటీ: పశ్చిమ దేశాల దన్ను చూసుకుని ఇజ్రాయిల్ పాశవివక దాడులు యథేచ్ఛగా సాగిస్తోంది. గాజా అంతటా ఇజ్రాయిల్ సైన్యం బుధవారం జరిపిన దాడుల్లో 38 మంది పాలస్తీనీయులు మరణించారు. బీట్ లాహియా టౌన్‌లో ఇజ్రాయిల్ జరిపిన వైమానిక దాడులు ఎక్కువగా పౌర ఆవాసాలను లక్ష్యంగా చేసుకుని సాగించినవేనని గాజా అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో మానవతా సాయం అందించే కార్యకర్తలు పన్నెండు మంది చనిపోయారు.
ఇజ్రాయిల్ దళాలు చివరికి మానవతా సాయం అందించే కార్యకర్తలను కూడా లక్షం చేసుకున్నదనడానికి గురువారం నాటి దాడి ఒక నిదర్శనం. గగన తల, భూతల దాడులతో గాజాలో పెద్దయెత్తున విధ్వంసం సృష్టించింది. యుద్ధ పీడిత గాజా ప్రాంత పౌరులకు ఆహారం ఇతర నిత్యావసరాలు అందకుండా ఇజ్రాయిల్ అడ్డుకుంటోంది.
తక్షణ కాల్పుల విరమణ ఐరాస జనరల్ అసెంబ్లీ డిమాండ్
గాజాలో తక్షణమే కాల్పుల విరమణ పాటించాలని ఐరాస జనరల్ అసెంబ్లీ డిమాండ్ చేసింది. ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని జనరల్ అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టగా మొత్తం 193 సభ్యులకు గాను 158 మంది దీనికి మద్దతు తెలిపారు. తొమ్మిది మంది వ్యతిరేకించగా, 13 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.