గాజా : ఇజ్రాయిల్ సైన్యం గాజాపై ఏడాదికిపైగా దాడులు కొనసాగిస్తూనే ఉంది.తాజాగా గాజా స్ట్రిప్‌లో ఇజ్రాయిల్ సైన్యం జరిపిన దాడుల వల్ల 42 మంది మృతి చెందారని గాజాలోని వైద్య వర్గాలు వెల్లడించాయి. దాడులను తీవ్రతరం చేయడానికి ఇజ్రాయిల్ దళాలు గాజా ఉత్తర, దక్షిణ భూభాగాలకు చేరుకున్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
కాగా, ఇజ్రాయిల్ – హిజ్బుల్లా మధ్య 60 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన ఒకరోజు పూర్తికాకుండానే.. ఇజ్రాయిల్ సైన్యం లెబనాన్‌పై దాడి చేసింది. లెబనాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో దాడులు చేయాల్సి వచ్చిందని ఇజ్రాయిల్ పేర్కొంది. అయితే ఇజ్రాయిల్‌నే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు లెబనాన్ సైన్యం ఆరోపించింది.
మరోవైపు అంతర్జాతీయ సంఘీభావ దినోత్సవం (డిసెంబర్ 20వ తేదీ) సందర్భంగా పాలస్తీనియన్లకు న్యాయం చేయాలని మాల్దీవుల అధ్యక్షులు ముయుజు డిమాండ్ చేశారు. పాలస్తీనా భూభాగాన్ని అక్రమంగా ఆక్రమించడాన్ని ఇజ్రాయిల్ ఆపాలని డిమాండ్ చేయడానికి అంతర్జాతీయ సమాజం కలిసి రావాలని ముయిజు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు.