Guatemala : లోయలో పడిన బస్సు .. 55 మంది మృతి

గ్వాటెమాలా సిటీ :   గ్వాటెమాలాలో బస్సులోయలో పడటంతో 55 మంది మరణించారు. గ్వాటెమాలా రాజధాని శివార్లలో సోమవారం ఈ ఘటన జరిగింది. ప్రమాదస్థలి నుండి 53 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, ఆస్పత్రికి తరలించాక మరో ఇద్దరు ప్రయాణికులు మరణించారని ప్రజా మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

తెల్లవారుజామున గ్వాటెమాలా రాజధానికి ఈశాన్యంగా ప్రొగ్రెసో నుండి బస్సు వస్తోందని, పలు వాహనాలు ఢ కొనడంతో రహదారిపై నుండి వంతెన క్రింద మురుగుకుంటలో పడినట్లు అగ్నిమాపక అధికార ప్రతినిధి ఎడ్విన్‌ విల్లాగ్రాన్‌ పేర్కొన్నారు. బస్సు 115 అడుగుల లోతులో ఉన్న మురుగు నీటి ప్రవాహంలో తలక్రిందులుగా పడిందని, సగం బస్సు మురుగునీటిలో మునిగిపోయిందని  అన్నారు. ఈ ప్రమాదంలో  55 మంది మరణించగా, మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయని చెప్పారు. బాధితుల్లో చిన్నారులు కూడా ఉన్నారని అన్నారు.

ఈ ఘటనపై గ్వాటెమాలా అధ్యక్షుడు బెర్నార్డో అరెవాలో తన సంతాపాన్ని తెలిపారు. నేడు జాతీయ సంతాప దినంగా ప్రకటించారు.

➡️