గాజాలో 67మంది పాలస్తీనియన్లు మృతి

Feb 13,2024 10:54 #Gaza

గాజా : రఫా నగరంలో సోమవారం తెల్లవారుజామున ఇజ్రాయిల్‌ బలగాలు జరిపిన వైమానిక, సముద్ర దాడుల్లో 67మంది పాలస్తీనియన్లు మరణించారు. రాత్రి సమయంలో ఆకాశం నుండి యుద్ధ విమానాలు చేసిన దాడులతో శరణార్ధ శిబిరాల్లో బీభత్సం చోటు చేసుకుందని మీడియా పేర్కొంది. 20 నిముషాల పాటు ఈ పేలుళ్లు సాగాయి. గాయపడిన వారు, నిర్వాసితులు అందరూ షబౌరా ఏరియాలో తెరిచి వున్న ఒకే ఒక కువైటీ ఆస్పత్రికి మూకుమ్మడిగా పరుగులెత్తారని తెలిపింది. ఇజ్రాయిల్‌ సైన్యం దారుణాలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయని, ఒక రకమైన నిస్సహాయత నెలకొంటోందని ఒక విలేకరి వ్యాఖ్యానించారు. ఇదిలావుండగా, హమాస్‌పై పూర్తి విజయాన్ని సాధించేవరకు యుద్ధం కొనసాగుతూనే ఉంటుందని నెతన్యాహు స్పష్టం చేశారు. హమాస్‌ చెరలో వున్న బందీలను విడిపించడమే లక్ష్యమన్నారు. డచ్‌ ప్రధాని మార్క్‌ రూట్‌తో భేటీ సందర్భంగా నెతన్యాహు పై వ్యాఖ్యలు చేశారు. రఫా శివారు ప్రాంతమైన షబౌరాలో ఒక ఇంట్లో బందీలుగా వున్న ఇద్దరిని విడిపించినట్లు ఇజ్రాయిల్‌ ఆర్మీ తెలిపింది. మరోవైపు ఖాన్‌ యూనిస్‌ నగరంలోని నాజర్‌ ఆస్పత్రిలో ఏడుగురిని చంపేశారని గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. జనంతో కిక్కిరిసిపోయి వున్న రఫా నగరంపై పదాతి దాడులకు దిగాలన్న ఇజ్రాయిల్‌ ప్రణాళికలు బందీల మార్పిడిపై జరిగే చర్చలను దెబ్బతీస్తాయని సీనియర్‌ హమాస్‌ నేత వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు గాజాపై దాడుల్లో 28,340మంది మరణించగా, 67,984మంది గాయపడ్డారు.

ఇయు దేశాలకు లేఖ

గాజాలో సాగుతున్న మారణకాండపై అంతర్జాతీయ న్యాయ స్థానం ఇచ్చిన ఆదేశాలను ఇజ్రాయిల్‌ అమలు చేసేలా చూడాలని కోరుతూ 16 ఇయు దేశాలకు మానవ హక్కుల గ్రూపులు, సంఘాలు లేఖ రాశాయి. ఇయు దేశాలిచ్చిన సమాధానం చాలా అసంతృప్తిగా వుందని ఆయా గ్రూపులు పేర్కొన్నాయి. ఇజ్రాయిల్‌పై ఆదేశాలను అమలు చేసేలా చూస్తామని కానీ లేదా వాటికి కట్టుబడే చట్టపరమైన బాధ్యత వుందన్న ఉద్దేశ్యం కానీ ఏ ఒక్క దేశమూ ప్రకటించలేదని పేర్కొన్నాయి.

➡️