గాజాలో 8 నెలలుగా ఇజ్రాయిల్‌ నరమేధం

Jun 8,2024 00:15 #Gaza, #Israeli genocide

– వేలాది మంది సామాన్య పౌరుల హననం
-చిన్నారులు, మహిళలు అని తేడా లేకుండా దాడులు
-ఆసుపత్రులను, పాఠశాలలను వదలని యుద్ధోన్మాదం
గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ అమానవీయ దాడులు మొదలై 8 నెలలు గడిచాయి. అమెరికా అండదండలతో నెతన్యాహు సాగిస్తున్న యుద్ధోన్మాద సైనిక దాడులకు వేలాది మంది సామాన్యులు ప్రాణాలు కోల్పయారు. శుక్రవారానికి గడిచిన 24 గంటల్లో మరో 77 మంది పాలస్తీనియన్లు మరణించారు. 221 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు మృతుల సంఖ్య 36,731కి చేరింది. 83,530కి పైగా పౌరులు గాయపడ్డారు. ఈ నరమేధంలో చిన్నారులు, మహిళలు కూడా పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.
2010లో గాజా సంక్షోభంపై పుస్తకం రాస్తూ ప్రముఖ రచయిత, ప్రొఫెసర్‌ నోమ్‌చోమ్‌స్కీ రాసిన కొటేషన్‌ ఈనాటికీ సరిగ్గా సందర్భానికి అతికినట్లు సరిపోతుంది. ”రాజకీయ ప్రయోజనాల కోసం పాలస్తీనియన్లకు అంతులేని నొప్పి, బాధ కలిగించడమనేది రాజ్యహింస, భయోత్పాతానికి మరో సుదీర్ఘ సిద్ధాంతం-వాస్తవానికి దాని మార్గదర్శక సూత్రం కూడా.” అన్నది ఆ కొటేషన్‌. గత ఎనిమిది మాసాలుగా అంతులేని రీతిలో సాగుతున్న ఈ దాడులు పెను మానవ విషాదాన్ని, విధ్వంసాన్ని నమోదు చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ కూడా ప్రజానీకం ఇలాంటి దాడులను చూడలేదు. ఈ భూమండలంపైనే అత్యంత జనసాంద్రత కలిగిన గాజాలో విధ్వంసం సాగిన తీరు ఊహకు అందని రీతిలో వుంది. ఆ క్రూరత్వాన్ని, వారి కక్ష సాధింపును చూస్తుంటే మనస్సు చలించిపోతోంది.
శిధిలాలు, రాళ్లు రప్పలతో మట్టిదిబ్బల కుప్పగా గాజా మారింది. ఇళ్లు, పాఠశాలలు, ఆస్పత్రులు, దుకాణాలు, బజార్లు మసీదులు, గ్రంథాలయాలు, ఇలా ప్రజా జీవనానికి పనికివచ్చేవి ఏవి వుంటాయో అవన్నీ కూడా నేలమట్టమైపోయాయి. అసలు పాలస్తీనా ప్రజలకు, ఇజ్రాయిల్‌ ప్రజలకు మధ్య తలెత్తిన ఈ ఘర్షణను పరిష్కరించాలని ఎవరైనా అనుకుంటే ముందు వారు సమస్య మూలాల్లోకి వెళ్ళాల్సి వుంటుంది. అలాగే ఈ ఘర్షణల చరిత్ర ఒకసారి తవ్వి తీస్తే కారణాలు కూడా కనబడతాయి. ఈ దాడులతో శూన్యం చోటు చేసుకోకుండా చూడడం చాలా ముఖ్యమని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదరిశ గుటెరస్‌ వ్యాఖ్యానించారు. 56 ఏళ్లు పాలస్తీనియన్లు ఇజ్రాయిల్‌ దురాక్రమణ సమస్యను అనుభవిస్తున్నారు. ఇజ్రాయిల్‌ సెటిల్‌మెంట్ల రూపంలో బరితెగిస్తూ ఆక్రమిస్తూపోతుండటంతో పాలస్తీనియన్ల భూమి క్రమేపీ దూరమవుతోంది. హింస అట్టుడుకుతోంది. వారి ఆర్థిక వ్యవస్థ నలిగిపోతోంది. వారి ప్రజలు నిర్వాసితులవుతున్నారు. ఇంతలా ఆక్రమణలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో సహజంగానే పాలస్తీనియన్లు ఎలాంటి అడ్డు ఆటంకం లేని రీతిలో స్వేచ్ఛను కోరుకుంటున్నారు. అచంచలమైన స్పూర్తితో పాలస్తీనా ప్రజానీకం స్వేచ్ఛ కోసం పోరాడడం కూడా సహజమే.

80 శాతానికి నిరుద్యోగం : ఐఎల్‌ఒ

ఇజ్రాయిల్‌ దాడుల కారణంగా గాజాలో జిడిపి క్షీణించిందని, నిరుద్యోగం 80 శాతానికి చేరుకుందని అంతర్జాతీయ కార్మిక సంఘం (ఐఎల్‌ఒ), పాలస్తీనా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ (పిసిబిఎస్‌) నివేదికలు తెలిపాయి. నిరుద్యోగిత రేటు గాజా స్ట్రిప్‌లో 79.1 శాతానికి, వెస్ట్‌బ్యాంక్‌లో 32 శాతానికి చేరుకుందని వెల్లడించాయి. ప్రజలు జీవనోపాధి, ఉద్యోగాలు కోల్పోయారని నివేదికలు తెలిపాయి. అలాగే, జిడిపి రేటు గాజాలో 83.5 శాతం, వెస్ట్‌బ్యాంక్‌లో 22.7 శాతం తగ్గింది. మొత్తంగా ఈ రెండు ప్రాంతాల్లో జిడిపి గత ఎనిమిది నెలల్లో సగటున 32.8 శాతం తగ్గింది. ఇజ్రాయిల్‌ చేస్తున్న భయంకరమైన యుద్ధం మానవ జీవితాలను బలితీసుకోవడమే కాకుండా.. జీవన పరిస్థితులను దారుణంగా మార్చిందని నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. ఆర్థిక కార్యక్రమాలు, జీవనోపాధులు విధ్వంసమయ్యాయని తెలిపాయి.

➡️