దక్షిణ కొరియాలో విమానం కూలి 179 మంది దుర్మరణం

Dec 29,2024 23:59 #accident, #Fire Accident, #South Korea
  • ల్యాండ్‌ అవుతుండగా రక్షణ గోడను ఢీకొట్టడంతో మంటలు
  • మువాన్‌ విమానాశ్రయంలో హృదయ విదారక దృశ్యాలు

సియోల్‌ : ఇటీవల కజకిస్థాన్‌లో విమాన ప్రమాదం ఘటన మరవకముందే దక్షిణ కొరియాలో మరొక దారుణం చోటు చేసుకున్నది. థాయ్ ల్యాండ్‌ రాజధాని బ్యాంకాక్‌ నుంచి 181 మందితో బయలు దేరిన విమానం..ఆదివారం ఉదయం దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు నైరుతి దిశగా 290 కిలోమీటర్ల దూరంలో ఉన్న మువాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్‌ అవుతూ అదుపు తప్పింది. రన్‌వేపై నుంచి కంచెలోకి దూసుకెళ్లింది. రన్‌వేను తాకుకుంటూ వెళ్లిన విమానం నేరుగా గోడను ఢీకొట్టి మంటల్లో చిక్కుకున్నది. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో మొత్తం 179 మంది మరణించినట్టు అధికారులు, స్థానిక వార్త సంస్థలు తెలియజేశాయి. ఈ ప్రమాదం నుంచి కేవలం ఇద్దరు సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడినట్టు సమాచారం. ఇది ఇప్పటివరకు జరిగిన కొరియా విమాన ప్రమాదాల్లో కెల్లా అత్యంత ఘోరమైనది.
పైలట్‌ ‘మేడే’ (ఓడలు, విమానాలు ప్రమాదంలో చిక్కుకున్నప్పుడు ఉపయోగించే అంతర్జాతీయ రేడియో డిస్ట్రెస్‌ సిగల్‌) సంకేతాలు ఇచ్చిన అయిదు నిమిషాలకే విమానం కుప్పకూలింది. ‘బ్లాక్‌ బాక్స్‌’ పాక్షికంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. సంవత్సరాంతపు టూర్‌లో భాగంగా బ్యాంకాక్‌ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికుల్లో 82 మంది పురుషులు ఉండగా, మహిళలు 93 మంది ఉన్నారు. మూడేళ్ల పిల్లల నుంచి 78 ఏళ్ల వృద్ధుల వరకు ఉన్నారు.

బ్యాంకాక్‌ నుంచి జెజు ఎయిర్‌ఫ్లైట్‌కు చెందిన 7సిి 2216 నంబర్‌ బోయింగ్‌ 737-800 శ్రేణి విమానం 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వస్తున్న క్రమంలో మువాన్‌ కౌంటీలోని విమానాశ్రయంలో ఈ ప్రమాదం సంభవించింది. ల్యాండింగ్‌ గేర్‌ పని చేయకపోవటం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమానిస్తున్నారు. కాగా, ఈ విమాన ప్రమాద లైవ్‌ దృశ్యాలు సోషల్‌ మీడియాలో షాక్‌కు గురి చేస్తున్నాయి. ఫ్లైట్‌ ఒక్కసారిగా పేలిపోయి, భారీగా మంటలు చెలరేగిన దృశ్యాలు కనిపించాయి. ఈ ఘటనలో విమానం మొత్తం పూర్తిగా కాలిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించాయి. ఇందుకు మొత్తం 32 అగ్నిమాపక వాహనాలు, పలు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోరు సాంగ్‌-మోక్‌ ఈ ప్రమాదంపై స్పందించారు. అంతర్గత, భద్రతా మంత్రిత్వ శాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని చెప్పారు. విమానంలో ప్రయాణిస్తునన్నవారిలో ఎక్కువ మంది కొరియన్లు, ఇద్దరు థాయ్ దేశస్థులు ఉన్నారని తెలిసింది.

జనవరి 4 వరకు జాతీయ సంతాప దినాలు

విమాన ప్రమాద ఘటన నేపథ్యంలో చోరు సాంగ్‌-మోక్‌ వచ్చే నెల 4 వరకు జాతీయ సంతాప దినాలను ప్రకటించారు. ఈ ప్రమాదంపై ఎక్స్‌లో ఆయన స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం సానుభూతి తెలియజేస్తున్నదని పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని ప్రత్యేక విపత్తు జోన్‌గా ప్రకటించారు. ఇటు థారులాండ్‌ ప్రధాని పేటోంగ్టార్న్‌ షినవత్రా కూడా మృతుల కుటుంబాలకు, గాయపడినవారికి సానుభూతిని తెలియజేశారు.

క్షమాపణలు చెప్పిన జెజు సిఇఒ కిమ్‌ ఈ-బే

జెజు ఎయిర్‌లైన్స్‌ను దక్షిణ కొరియాలో భారీ బడ్జెట్‌తో 2005లో స్థాపించారు. అయితే, ప్రస్తుత ఘటనతో ఈ ఎయిర్‌లైన్స్‌ తొలిసారి ఇది అతిపెద్ద ప్రమాదాన్ని చూసింది. ఈ ప్రమాదంపై జెజు ఎయిర్‌ సిఇఒ కిమ్‌ ఇబే స్పందించారు. ప్రమాదం పట్ల క్షమాపణలు చెప్పారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామనీ, అదే తమ ప్రాధాన్యత అని చెప్పారు. దర్యాప్తునకు ఎయిర్‌లైన్స్‌ సహకరిస్తుందని వివరించారు.

గతంలో ప్రమాదాలు

1997లో గువామ్‌లో కొరియన్‌ ఎయిర్‌లైన్స్‌ ప్రమాదంలో 200 మందికి పైగా మృతి చెందారు. ఆ తర్వాత అతిపెద్ద విమాన ప్రమాదం ఇదే కావటం గమనార్హం. ఇక ఎయిర్‌ చైనా నడిపే బోయింగ్‌ 767-200 విమానం 2002లో దక్షిణ కొరియాలో ప్రమాదానికి గురై 129 మంది మరణానికి కారణమైంది. ఈ ఘటనలో 37 మంది గాయపడ్డారు.

➡️