దక్షిణాఫ్రికాలో హంగ్‌ పార్లమెంట్‌

Jun 2,2024 23:00 #hung parliament, #South Africa
  • సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుపై ఎఎన్‌సి దృష్టి
  • ఇది సంకీర్ణాల యుగం: ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌

జొహానెస్‌బర్గ్‌ : దక్షిణాఫ్రికా సార్వత్రిక, రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఆఫ్రికన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ (ఎఎన్‌సి)కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 2019లో 57.5 శాతం ఓట్లు సాధించిన ఆ పార్టీ ఈ సారి 41శాతం ఓట్లు మాత్రమే సాధించింది. 400 స్థానాలు ఉన్న పార్లమెంటులో మెజార్టీ సీట్లు సాధించేందుకు అవసరమైన 50శాతానికిపైగా ఓట్లు సాధించడంలో విఫలమైంది. దామాషా పద్ధతిన జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ఓటింగ్‌ శాతం వచ్చిందనే దానిని బట్టి ఆ పార్టీకి పార్లమెంటరీ సీట్లు కేటాయించబడతాయి. ఆ లెక్కన ఎఎన్‌సికి ఇప్పుడు లభించిన ఓటింగ్‌ శాతాన్ని బట్టి 160 నుంచి165 సీట్ల దాకా రావచ్చు. పార్లమెంటులో ఏకైక అతి పెద్ద పార్టీగా అది ఆవిర్భవిస్తుంది. కానీ, మెజార్టీకి అవసరమైన 201 సీట్లు మార్కును చేరుకోవాలంటే ఇతర పార్టీల సహకారం అవసరం. ప్రస్తుతం సంకీర్ణ భాగస్వాముల కోసం అది సంప్రదింపులు చేపట్టే పనిలో ఉంది. వర్ణ వివక్ష నుండి 1994లో దక్షిణాఫ్రికా విముక్తి పొందిన తరువాత వరుసగా జరిగిన ఆరు పార్లమెంటు ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ముప్పయ్యేళ్లపాటు అధికారంలో నిరాఘాటంగా కొనసాగుతూ వచ్చిన ఎఎన్‌సి మొదటిసారి మెజార్టీ సాధించడంలో విఫలమైంది. దీనికి నైతిక బాధ్యత వహించి అధ్యక్షుడు సిరిల్‌ రమాఫొసా (71) తప్పుకోవాలని ఆయనకు బద్ధ విరోధి, అవినీతి ఆరోపణలతో 2018లో అధ్యక్ష పదవి నుంచి తొలగించబడిన జాకోబ్‌ జుమా (82) డిమాండ్‌ చేశారు.ఈ డిమాండ్‌ను ఎఎన్‌సి తిరస్కరించింది. ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందిందన్న యూరప్‌ దేశాల్లోనే సంకీర్ణ ప్రభుత్వాలు నడుస్తున్నాయని ఎఎన్‌సి ప్రధాన కార్యదర్శి ఫికిల్‌ ఎంబెలూలా చెప్పారు. సంకీర్ణాలు ఇప్పటివరకు రాష్ట్రాల స్థాయిలోనే ఉండేవి. ఇప్పుడు జాతీయ స్థాయికి వచ్చాయి అని ఆయన అన్నారు. సుస్థిరమైన పాలన అందించేందుకు సరైన సంకీర్ణ నమూనా కోసం అధ్యయనం చేస్తున్నామని ఆయన చెప్పారు.
జాన్‌ స్టీన్‌ హుస్సేన్‌ (48) నాయకత్వంలోని మధ్యేవాద మితవాద డెమొక్రటిక్‌ అలయెన్స్‌ (డిఎ) పార్టీ 21.68 శాతం ఓట్లతో రెండవ అతిపెద్ద పార్టీగా నిలవగా, జాకబ్‌ జుమా నాయకత్వంలోని ఎంకెపి 14,71 శాతం ఓట్లు సాధించి మూడవ అతి పెద్ద పార్టీగా నిలిచింది. కోర్టు ధిక్కార కేసులో జైలు శిక్ష పడిన జుమాను ఎన్నికల్లో పాల్గొనకుండా అనర్హత వేటు వేయడంతో ఆయన సొంతంగా ఎంకె పార్టీని స్థాపించాడు. ఎఎన్‌సి నుంచి బయటకు వచ్చిన యూత్‌ లీడర్‌ జులియస్‌ మలేమా (43) నేతృత్వంలో ఏర్పాటైన ఎకనమిక్‌ ఫ్రీడమ్‌ ఫైటర్స్‌ (ఇఎఫ్‌ఎఫ్‌) పార్టీ 9.46 శాతం ఓట్లతో నాల్గవ స్థానంలో నిలిచింది.
2019 ఎన్నికల్లో ఎఎన్‌సికి 57.5 శాతం ఓట్లు, 230 సీట్లు రాగా, డిఎ పార్టీకి 21 శాతం ఓట్లు 84 సీట్లు, ఇఎఫ్‌ఎఫ్‌ 11 శాతం ఓట్లు 44 సీట్లు వచ్చాయి. ఇంకతా ఫ్రీడమ్‌ పార్టీ 3.5 శాతం ఓట్లతో 14 సీట్లు సాధించింది. చిన్న చితక పార్టీలు మిగతా 28 సీట్లను దక్కించుకున్నాయి.

➡️