చైనా సైన్యంలో రోబో డాగ్‌

May 29,2024 23:41 #A robot dog, #Chinese army

బీజింగ్‌ : చైనా సైన్యం అభివృద్ధి చేసిన రోబో డాగ్స్‌ను కంబోడియాలో జరిగిన సైనిక విన్యాసాల్లో ప్రదర్శించారు. ఈ రోబో డాగ్‌పై ఆటోమేటిక్‌ రైఫిల్‌ను అమర్చారు. లక్ష్యంపై గురితప్పకుండా కాల్పులు జరుపుతూ ముందుకు వెళ్లేలా డిజైన్‌ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను చైనా ప్రభుత్వరంగ మీడియా సంస్థ సిసిటివి ప్రసారం చేసింది. ”మా పట్టణ యుద్ధ తంత్రంలో సరికొత్త సభ్యుడు వచ్చాడు. గస్తీ, శత్రువును గుర్తించడం, లక్ష్యంపై దాడి చేయడానికి మనుషుల స్థానంలో ఇది రానుంది” అని ఆ వీడియోలో వెల్లడించారు. కంబోడియాలో నిర్వహించిన ‘గోల్డెన్‌ డ్రాగన్‌-2024’ యుద్ధ విన్యాసాల సందర్భంగా దీనిని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ వీడియోలో డ్రోన్‌ తుపాకులను కూడా చైనా సైన్యం ప్రదర్శించింది. నిజానికి గతేడాది నవంబర్‌లో కూడా చైనా, కంబోడియా, వియత్నాం పాల్గన్న సంయుక్త సైనిక విన్యాసాల్లో ఇవి కనిపించాయి.
ఈ రోబో డాగ్‌లు బ్యాటరీపై ఆధారపడి రెండు నుంచి నాలుగు గంటలపాటు పనిచేస్తాయి. ముందుకు, వెనక్కు, పడుకోవడం, దూకడం వంటివి చేయగలవు. దీనిలోని మ్యాప్‌ల ఆధారంగా మార్గనిర్దేశం చేసుకొని లక్ష్యం వైపు ప్రయాణిస్తాయి. మార్గం మధ్యలో ఎదురయ్యే ఎటువంటి అడ్డంకులనైనా తప్పించుకోగలవు. వీటిని డ్రోన్ల సాయంతో మోహరించే అవకాశం ఉంది. చైనాకు చెందిన యూనీట్రీ సంస్థ ఈ మర కుక్కలను రూపొందించినట్లు తెలుస్తోంది. వీటి ఖరీదు మోడల్‌ను బట్టి 2,800 డాలర్ల నుంచి లక్ష డాలర్ల వరకు ఉంది. చైనా సైనిక బడ్జెట్‌ ప్రస్తుతం అధికారికంగా 231 బిలియన్‌ డాలర్లు.
ఈ రోబో కుక్క బరువు 15 కిలోలు ఉంటుంది. దీనిలో ఇన్‌బిల్ట్‌ సెన్సర్లు ఉంటాయి. 4డీ వైడ్‌ యాంగిల్‌ పర్సిప్షన్‌ సిస్టమ్‌ను అమర్చారు. సైనికులతో సమానంగా ఇది యుద్ధ విన్యాసాలు చేయగలదు.
మరోవైపు అమెరికా వాయుసేన 2020లో రోబోడాగ్స్‌ వినియోగాన్ని పరీక్షించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, డేటా అనలటిక్స్‌ను వాడుకొని పనిచేసే అడ్వాన్స్‌డ్‌ బ్యాటిల్‌ మేనేజ్‌మెంట్‌ వ్యవస్థలో ఇదొక భాగం.

➡️