రోహింగ్యాలపై నేరాలకు పాల్పడిన మయన్మార్‌ సైనిక నేతపై చర్యలు ?

  • అరెస్టు వారెంట్‌ జారీ యోచనలో ఐసిసి

నెపిడా : ముస్లిం మైనారిటీలైన రోహింగ్యాలను హింస, వేధింపులకు గురి చేయడం ద్వారా మయన్మార్‌ మిలటరీ నేత మిన్‌ ఆంగ్‌ హ్లాయింగ్‌ మానవాళికి వ్యతిరేకంగా పాల్పడిన నేరాలకు అరెస్టు వారంట్లు జారీ చేయాలని భావిస్తున్నట్లు అంతర్జాతీయ క్రిమినల్‌ న్యాయస్థానం (ఐసిసి) ప్రాసిక్యూటర్‌ బుధవారం తెలిపారు. మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల్లో రోహింగ్యాలను వేధిస్తూ, వారిని దేశం నుండి తరిమివేసినందుకు నేరపూరితమైన బాధ్యత వహించడానికి తగిన కారణాలు వున్నాయా లేదా అన్న అంశంపై ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన కమిటీ నిర్ణయించనుంది. అయితే వారు నిర్ణయం తీసుకోవడానికి కాలపరిమితి అంటూ లేదు. కానీ అరెస్టు వారంటు జారీ చేయాలంటే కనీసం మూడు నెలలు పడుతుందని అంచనా. కాగా దీనిపై మయన్మార్‌ పాలక జుంటా ప్రతినిధి వ్యాఖ్యానించడానికి తిరస్కరించారు. ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు, మాజీ రక్షణ చీఫ్‌ యోవ్‌ గాలంట్‌లకు అరెస్టు వారంట్లు జారీ అయిన నేపథ్యంలో మయన్మార్‌ నేతపై కూడా ఈ తరహా చర్యలు చేపట్టాలని అమెరికా సహా పలు దేశాలు ఐసిసిపై ఒత్తిడి తెస్తున్నాయి. దాంతో ఈ విషయంపై ఆలోచన చేస్తున్నట్లు ఐసిసి ప్రాసిక్యూటర్‌ కార్యాలయం తెలిపింది. 7,30,000వేల మందికి పైగా రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు పారిపోయారని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. కాగా ఊచకోత ఆరోపణలను మయన్మార్‌ తిరస్కరిస్తోంది. పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, తీవ్రవాదులపైనే తమ చర్యలని చెబుతోంది.

➡️