Ceasefire : తిరిగి దక్షిణ లెబనాన్‌కు పయనమైన స్థానికులు

బీరుట్‌ : ఇజ్రాయిల్‌, హిజ్బుల్లా కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, వేలాది మంది గురువారం దక్షిణ లెబనాన్‌కు తిరిగి పయనమయ్యారు. భారీగా కార్లు, వ్యాన్‌లు టైర్‌ నగరం మీదుగా పయనిస్తున్న దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. ఇజ్రాయిల్ దాడులతో వేలాది మంది  లెబనాన్‌ను విడిచి సురక్షిత ప్రాంతాలకు పారిపోయిన సంగత తెలిసిందే. రెండు నెలల అనంతరం ఓ తండ్రి, కుమార్తెలు తిరిగి కలుసుకున్న దృశ్యాలను జాతీయ మీడియా విడుదల చేసింది. ఈ సందర్భంగా కాల్పుల విరమణను స్వాగతిస్తున్నట్లు ప్రకటించింది. కాల్పుల విరమణతో పలువురు తిరిగి తమ కుటుంబ సభ్యులను కలుసుకుంటున్నారని పేర్కొంది.

స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5.00 గంటల నుండి 7.00 గంటల వరకు లిటాని నదికి దక్షిణంగా లెబనాన్‌ నివాసితులను వెళ్లవద్దని ఇజ్రాయిల్‌ సైన్యానికి చెందిన అరబిక్‌ ప్రతినిధి హెచ్చరించారు. ఇజ్రాయిల్‌ దళాలు ఇప్పటికి అక్కడ ఉన్నాయని అన్నారు. కాల్పుల విరమణ ఒప్పందం ప్రకారం.. లిటానికి దక్షిణంగా లెబనాన్‌ సైన్యం అదనపు దళాలను మోహరించడం ప్రారంభించిందని చెప్పారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని భారత్‌ స్వాగతించింది. చర్చలు, దౌత్యం ద్వారా ఇరు దేశాల మధ్య సమస్యను పరిష్కరించడానికి తాము మద్దతిస్తామని తెలిపింది.

ఇజ్రాయిల్‌, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం తెల్లవారుజాము నుండి అమల్లోకి వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్త్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరుపక్షాలు ఆమోదించాయి.

➡️