ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం

May 14,2024 00:20 #An erupting volcano, #Indonesia

5కిలోమీటర్ల ఎత్తున బూడిద మేఘాలు
జకార్తా : ఇండోనేషియాలోని మారుమూల ద్వీపమైన హల్మాహెరాలో మౌంట్‌ ఇబూ అగ్నిపర్వతం సోమవారం ఉదయం బద్దలైంది. ఆకాశంలోకి దాదాపు 5కిలోమీటర్ల ఎత్తున బూడిదను వెదజల్లుతోందని దేశ అగ్నిపర్వతాలు, భూకంపాల అధ్యయన కేంద్రం వెల్లడించింది. ఈ నెల 10వ తేదీన కూడా ఇదే రీతిలో బూడిద విరజిమ్మిందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అగ్నిపర్వతానికి 5కిలోమీటర్ల పరిధిలో ఏ విధమైన కార్యకలాపాలు చేపట్టరాదంటూ నిషేధం విధించారు. బూడిద వర్షంలా వెదజల్లడం ఆరంభమైనందున సమీప ప్రాంతాల ప్రజలు మాస్క్‌లు, గ్లాస్‌లు ధరించాలని కోరారు. అగ్నిపర్వతం చీలికల నుండి బూడిద రావడంతో పాటు శబ్దాలు కూడా వస్తున్నాయని చెప్పారు. పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌ మీద వున్న ఇండోనేషియాలో 127 క్రియాశీలంగా వున్న అగ్నిపర్వతాలు వున్నాయి. ఇటీవలివారాల్లోనే ఉత్తరు సులవేశి ప్రాంతంలో రువాంగ్‌ అగ్నిపర్వతం బద్దలైంది. పెద్ద మొత్తంలో లావా, బూడిదను విరజిమ్మంది. గత డిసెంబరులో మారాపి అగ్నిపర్వతం బద్దలైన ఘటనలో 20మందికి పైగా మరణించారు.

➡️