South Korea: యూన్‌ అరెస్టుకు మరో వారెంట్‌ జారీ

సియోల్‌ : దేశంలో సైనిక పాలన విధించిన కేసులో అభిశంసించబడిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్‌ సుక్‌ యోల్‌ను అరెస్టు చేసేందుకు మరోసారి వారెంటు జారీ అయింది. ఈ మేరకు దక్షిణ కొరియా అవినీతి నిరోధక సంస్థకు ఆదేశాలు అందాయి. సస్పెండయిన అధ్యక్షుడి అరెస్టుకు గత శుక్రవారం దర్యాప్తు అధికారులు తీవ్రంగా యత్నించి విఫలమయ్యారు. యూన్‌ను అరెస్టు చేయాల్సిందేనని దక్షిణ కొరియన్లు అధ్యక్ష భవనం ఎదుట శిబిరాలు ఏర్పాటు చేసి డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి పోటీగా యూన్‌ తన అనుయాయులను ఆందోళనకు దింపారు. దీంతో అక్కడ ఆరు గంటలపాటు ఉద్రిక్తత నెలకొంది. ఈ సారి యూన్‌ను అరెస్టు చేసే బాధ్యత పోలీసులే తీసుకోవాలని దర్యాప్తు అధికారులు కోరారు. మొదట జారీ చేసిన ఆరెస్టు వారెంట్‌ అమలుకు వారం రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. తాజాగా జారీ చేసిన వారెంటు ఎన్ని రోజులు అమల్లో వుంటుందో నిర్దిష్టంగా వెల్లడించలేదు. యూన్‌ను నిర్బంధంలోకి తీసుకోవడానికి సియోల్‌ పశ్చిమ జిల్లా కోర్టు గత వారం మొదటి వారెంట్‌ జారీ చేసింది. ఆయన నివాసాన్ని సోదాచేయడానికి విడిగా మరో వారెంట్‌ ఇచ్చింది.. డిసెంబరు 3న విధించిన మార్షల్‌ లా డిక్రీపై ప్రశ్నించేందుకు హాజరు కావాల్సిందిగా అధికారులు పంపిన సమన్లను ఆయన ధిక్కరిస్తూ వచ్చారు. ఆ తర్వాత అధికారులు మరో ప్రయత్నం చేయలేదు. సోమవారంతో ఆ కోర్టు వారంట్ల గడువు ముగిసిపోయింది.

➡️