యాంటీ-వార్‌షిప్‌ క్రూయిజ్‌ క్షిపణి ప్రయోగం సక్సెస్‌

ఇరాన్‌ : ఇరాన్‌ తాజాగా వెయ్యి కిలోమీటర్ల పరిధి సామర్థ్యం కలిగిన నూతన యాంటీ-వార్‌షిప్‌ క్రూయిజ్‌ క్షిపణిని పరీక్షించింది. ఇది పర్షియన్‌ గల్ఫ్‌తో పాటు ఒమన్‌ సముద్రంలోని యూఎస్‌ నేవీ నౌకలను లక్ష్యంగా చేసుకోగలుగుతుంది. ఈ క్షిపణి గదర్‌-380 టైప్‌ ఎల్‌ విభాగానికి చెందినది. ఇది యాంటీ-జామింగ్‌ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది శత్రువుల జామింగ్‌ వ్యవస్థలను కూడా అడ్డుకోగలుగుతుంది.

ఐదు నిముషాల కంటే తక్కువ సమయం…
ఈ క్షిపణిని భూగర్భ సౌకర్యాల నుండి ప్రయోగించవచ్చని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ నేవీ అధిపతి జనరల్‌ అలీ రెజా తాంగ్సిరి తెలిపారు. దీనిని ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే ప్రయోగించవచ్చు. అయితే ఈ క్షిపణి మోసుకెళ్లే వార్‌హెడ్‌ గురించి లేదా పరీక్ష సమయం గురించి ఇరాన్‌ వెల్లడించలేదు. ఈ క్షిపణి వ్యవస్థ గార్డ్‌ క్షిపణి వ్యవస్థలలో ఒక భాగం మాత్రమే అని, ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలను సమర్థవంతంగా ఎదుర్కోగలదని సమాచారం.

శత్రు యుద్ధనౌకలకు చుక్కలు చూపిస్తుంది : ఇరాన్‌
ఈ క్షిపణిని మధ్య ఇరాన్‌ నుండి ఒమన్‌ సముద్రంలోకి ప్రయోగించారు. ఈ క్షిపణిని నిపుణుడైన ఒక వ్యక్తి ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలో సిద్ధం చేసి ప్రయోగించగలడని, ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఇరాన్‌ ఒక నివేదికలో పేర్కొంది. ఇరాన్‌ ఈ క్షిపణిని దక్షిణ తీరంలోని భూగర్భ క్షిపణి కేంద్రం నుండి ప్రయోగించింది. ఈ క్షిపణి శత్రు యుద్ధనౌకలకు చుక్కలు చూపిస్తుందని ఇరాన్‌ పేర్కొంది. 2024లో గాజాలోని హమాస్‌, లెబనాన్‌లోని హిజ్బుల్లాతో యుద్ధం జరుగుతున్న సమయంలో ఇరాన్‌ రెండు వేర్వేరు సందర్భాలలో ఇజ్రాయెల్‌పై వందలాది క్షిపణులను ప్రయోగించింది. అయితే ఇజ్రాయెల్‌ తన రక్షణ వ్యవస్థల ద్వారా ఈ క్షిపణులను అడ్డుకుని, నాశనం చేసింది.

➡️