రఫా నగరాన్ని పూర్తిగా చుట్టుముట్టిన సైన్యం

  • త్వరలో మరిన్ని ప్రాంతాల స్వాధీనం
  • మూడు వారాల్లో 224 దాడులు

గాజా : గాజాలోని రఫా నగరాన్ని మొత్తంగా చుట్టుముట్టినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ శనివారం ప్రకటించింది. గాజాలోని మరిన్ని ప్రాంతాలను కూడా ఇలాగే స్వాధీనం చేసుకుంటామని మిలటరీ బలగాలు వెల్లడించాయి. ఈలోగా పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడ నుండి ఖాళీ చేయాల్సి వుంటుందని స్పష్టం చేశాయి. మార్చి 18న తిరిగి దాడులు మొదలు పెట్టినప్పటి నుండి రఫా వ్యాప్తంగా ప్రజలందరూ ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని మిలటరీ ఆదేశాలు జారీ చేసింది. సముద్ర తీర ప్రాంతాల్లో వేసిన శిబిరాలకు తరలిపోవాలంటూ సూచించింది. దక్షిణంగా ఈజిప్ట్‌ సరిహద్దులు కలిగిన 60 చదరపు కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని గల 24గంటలుగా మొత్తంగా తన అధీనంలోకి తీసుకున్న బలగాలు రఫాను ఖాన్‌ యూనిస్‌తో వేరుచేస్తూ ఒక దారిని వేశారని సైన్యం శనివారం తెలిపింది. ఈ దాడుల కార్యక్రమాలను మరిన్ని ప్రాంతాలకు విస్తరించ నున్నట్లు ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి ఇజ్రాయిల్‌ కట్జ్‌ శనివారం తెలిపారు. దాడులు జరిగే ప్రాంతాల నుండి వెళ్లిపోవాల్సిందిగా ప్రజలను హెచ్చరించారు.

మహిళలు, పిల్లలే ప్రధాన లక్ష్యం !

మహిళలు, పిల్లలనే ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయిల్‌ మిలటరీ హత్య చేస్తోందని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. మార్చి 18 నుండి ఈ నెల 9 వరకు ఇజ్రాయిల్‌ 36 వైమానిక దాడులు నిర్వహించింది. వాటిలో కేవలం మహిళలు, పిల్లలు మాత్రమే మరణించారు. మూడు వారాలుగా సాగుతున్న ఈ దాడుల్లో గాజాలో ఏ ప్రదేశమూ సురక్షితంగా లేదని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హైకమిషనర్‌ రవీనా శందాసాని అన్నారు. శుక్రవారం తెల్లవారుజామున ఖాన్‌ యూనిస్‌లో జరిగిన వైమానిక దాడిలో ఏడుగురు పిల్లలు సహా ఒక కుటుంబానికి చెందిన పదిమంది మరణించారు. ఇతర ప్రదేశాలలో మరో ఐదుగురు మరణించారు. గాజాను భూమిపై నరకంగా రెడ్‌ క్రాస్‌ అభివర్ణించింది.

➡️