- వర్ధంతి సందర్భంగా హాజరైన జనసంద్రం
హవానా : మన జ్ఞాపకాల్లో వారు రగిలించిన జ్వాలలు రగులుతున్నంత కాలమూ వీరులకు మరణం లేదు. ఇందుకు విరుద్ధంగా, లక్షలాదిమంది ప్రజల ఆకాంక్షలకు, గౌరవానికి చిహ్నంగా మారిన వ్యక్తులను మనం విస్మరిస్తే ఇక మనం మన గమ్యాన్ని పోగొట్టుకున్నట్లే. ఒక వెయ్యి సంవత్సరాలు గడిచినా కూడా హవానా యూనివర్శిటీ మెట్లు ప్రతి నవంబరు 25వ తేదీన జన సంద్రంతో పులకిస్తాయి. ఆ జనాల మదిలో ఫైడెల్ కాస్ట్రో పేరు ప్రతిధ్వనిస్తూ వుంటుంది. ఆ మహా విప్లవ వీరుడు మనల్ని వదిలివెళ్ళి ఈ నెల 25 నాటికి 8 సంవత్సరాలైన సందర్భంగా ఈ సోమవారం కూడా ఇవే దృశ్యాలు చోటు చేసుకున్నాయి.
ఈ నెల 25 సాయంత్రం జరిగిన కార్యక్రమానికి క్యూబా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ ఫస్ట్ సెక్రటరీ, దేశ అధ్యక్షుడు మిగుయె డియాజ్ కానెల్, పొలిటికల్ బ్యూరో సభ్యులు, పార్లమెంట్ అధ్యక్షుడు, సెంట్రల్ కమిటీ నిర్వహణా కార్యదర్శి ప్రభృతులు హాజరయ్యారు. తమ ప్రియతమ నేతకు విప్లవాంజలి ఘటించారు.
కాస్ట్రో చూపిన దారిలో ముందుకు సాగుతూ, ఆయన కన్న కలలు న్యాయం, శాంతిలను సాకారం చేయడమే మనం ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని రివల్యూషనరీ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ (ఎఫ్‌ఎఆర్) పొలిటికల్ డైరెక్టరేట్ అధిపతి అయిన మేజర్ జనరల్ విక్టర్ రోజో రామోస్ పేర్కొన్నారు. నేడు మనం పెను సవాళ్ళను ఎదుర్కొంటున్నాం, అనేక ప్రతికూలతలు, పరిమితులు కూడా వున్నాయి. అయితే అవసరాలు వనరులను అధిగమించవచ్చు కానీ సంకల్పశక్తిని, మనిషి సృజనాత్మకతను అధిగమించలేవని మనకు చూపించిన మహా నేతను మనం ఇక్కడ స్మరించుకోవాల్సి వుందని రోజో రోమోస్ వ్యాఖ్యానించారు.