- 24 ఏళ్ల తర్వాత మహిళకు పట్టం
కొలంబో : శ్రీలంక కొత్త ప్రధానిగా హరిణి అమరసూర్య (54) మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. తొలి ప్రధాని సిరిమావో బండారు నాయకె తర్వాత 24ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం మళ్లీ ప్రధాని పదవిని ఒక మహిళ చేపట్టారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాజీనామా చేసిన ప్రధాని దినేష్ గుణవర్ధనె స్థానంలో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పిపి) నాయకురాలైన హరిణితో అధ్యక్షుడు దిసనాయకె ప్రమాణ స్వీకారం చేయించారు. తనతోపాటు మరో ముగ్గురిని కేబినెట్ మంత్రులుగా నియమించారు. న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆరోగ్యం, పెట్టుబడులు వంటి శాఖలను ప్రధానికే అప్పగించారు. హక్కుల కార్యకర్త, యూనివర్శిటీ లెక్చరర్ అయిన అమరసూర్య దేశ 16వ ప్రధానిగా, దేశ చరిత్రలో మూడో మహిళా ప్రధానిగా రికార్డు సృష్టించారు. ఎన్‌పిపి పార్లమెంట్ సభ్యులు విజిత హీరత్, లక్ష్మణ్ నిపునరాచ్చి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. తాత్కాలిక కేబినెట్‌గా వీరు పనిచేస్తారు. పార్లమెంట్‌ను రద్దు చేసి, తక్షణ ఎన్నికలకు పిలుపివ్వనున్నారు. నవంబరు చివరిలో ఎన్నికలు జరగవచ్చని అధికారులు తెలిపారు. అలాగే 15 కీలక మంత్రిత్వ శాఖలకు కొత్త కార్యదర్శులను కూడా నియమించారు. వీరిలో ప్రధాన మంత్రి కార్యదర్శిగా జిపి సపుతంత్రి, కేబినెట్ కార్యదర్శిగా డబ్ల్యుఎండిజె ఫెర్నాండో ఉన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు యుఎన్‌పి నేత రణిల్ విక్రమ సింఘె పోటీ చేయరని ఆ పార్టీ ఉప నాయకుడు రువాస్ జయవర్దనే ప్రకటించారు.