రష్యాలో అసద్‌కు ఆశ్రయం

Dec 10,2024 00:37 #Assad, #finds refuge, #russia
  • స్పష్టం చేసిన క్రెమ్లిన్‌
  • సిరియా సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను గౌరవించాలి: చైనా

మాస్కో : సిరియా మాజీ అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు రష్యా ఆశ్రయం కల్పించింది. అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా దీనికి ఆమోదం తెలిపారని క్రెమ్లిన్‌ (రష్యా అధ్యక్ష భవనం) ప్రకటించింది. రాజకీయ ఆశ్రయం కల్పించాలన్న అసద్‌ అభ్యర్థనకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ స్వయంగా ఆమోద ముద్ర వేశారని క్రెమ్లిన్‌ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్‌ సోమవారం వెల్లడించారు. ప్రస్తుతానికి ఈ నేతల మధ్య ఎలాంటి సమావేశం లేదని స్పష్టం చేశారు. అసద్‌ ఆచూకీ గురించి వివరాలు చెప్పేది కూడా ఏమీ లేదన్నారు. అసద్‌కు రాజకీయ ఆశ్రయం ఎలా లభించిందని ప్రశ్నించగా ఇటువంటి నిర్ణయాలు దేశాధినేత జోక్యం లేకుండా జరగవని, ఇది పుతిన్‌ సొంత నిర్ణయమని చెప్పారు.

సిరియాలోని రష్యా మిలటరీ స్థావరాల భవితవ్యం గురించి ప్రశ్నించగా దాని గురించి ఇప్పుడే మాట్లాడడం తొందరపాటు అవగలదని పెస్కోవ్‌ వ్యాఖ్యానించారు. ఈ స్థావరాల గురించిన చర్చలు సిరియా కొత్త నేతలపై ఆధారపడి వుంటుందన్నారు. ప్రస్తుతం అక్కడ అస్థిరత నెలకొందన్నారు. సిరియాలో అకస్మాత్తుగా తలెత్తిన పరిణామాలు రష్యా సహా యావత్‌ ప్రపంచాన్ని దిగ్రాంతికి గురి చేశాయన్నారు. ఎవరైౖతే అధికారంలో వున్నారో వారితో చర్చలు జరిపేందుకు ఇంకా సమయముందన్నారు. తమకు కూడా దేశంలోని దౌత్య కార్యాలయాలను అస్థిరపరిచే ఆలోచన లేదని సిరియా ప్రతిపక్ష బలగాలు స్పష్టం చేశాయి.
సాయుధ తిరుగుబాటు దళాల ఆక్రమణతో సిరియా నుండి పారిపోయిన అసద్‌ రష్యా చేరుకున్నారని వచ్చిన వార్తల నేపథ్యంలో ఈ ప్రకటనతో ఒక స్పష్టత వచ్చింది. అసద్‌ ప్రభుత్వం కూలిపోయిన నేపథ్యంలో మాస్కోలోని సిరియన్‌ ఎంబసీపైన సిరియా ప్రతిపక్షం పతాకం ఎగిరింది. ఎంబసీ చుట్టూ పరిస్థితులు ప్రశాంతంగా వున్నాయని, అంతా సాధారణంగా సాగిపోతోందని మీడియా వ్యాఖ్యానించింది. స్పెయిన్‌, గ్రీస్‌, సెర్బియా, స్వీడన్‌లతో సహా పలు దేశాల్లో సిరియా ఎంబసీలపై కొత్త పతాకం రెపరెపలాడింది.

సిరియా సార్వభౌమాధికారాన్ని గౌరవించాలి : చైనా

సిరియా సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత గౌరవించాల్సిందేనని చైనా విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. సిరియాలో నెలకొన్న పరిస్థితులను అవకాశంగా తీసుకుని సిరియాలోని గొలాన్‌ హైట్స్‌ను ఆక్రమించడానికి ఇజ్రాయిల్‌ అవకాశం తీసుకుంది. డమాస్కస్‌లోని పలు లక్ష్యాలపై వైమానిక దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్‌ పై ప్రకటన చేశారు. సిరియాలో పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. సిరియా రాజకీయ సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతలను గౌరవించాలని తేల్చి చెప్పారు. సోమవారం తెల్లవారు జామున రాజధాని డమాస్కస్‌లో దాడుల శబ్దాలు వినిపించాయని మీడియా వార్తలు తెలిపాయి.

పరిస్థితిని పరిశీలిస్తున్నాం : భారత్‌

సిరియాలో తిరుగుబాటుదారులు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అక్కడి పరిస్థితిని పరిశీలిస్తున్నట్లు భారత్‌ తెలిపింది. కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ సోమవారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘సిరియా ఐక్యత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడేందుకు అందరూ కలిసి పనిచేయవలసిన అవసరాన్ని తాము ప్రస్తావిస్తున్నాం. సిరియా సమాజంలోని ప్రజలందరి ప్రయోజనాలను, ఆకాంక్షలను గౌరవించే శాంతియుత రాజకీయ వాతావరణం కోసం నిలబడతాము’ అని ప్రకటనలో పేర్కొంది. సిరియాలోని భారతీయ పౌరులందరూ సురక్షితంగా ఉన్నారని ఆదివారం మంత్రిత్వ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే.

➡️