మొరేల్స్‌పై హత్యాయత్నం!

Oct 28,2024 23:53 #assassination, #attempt on Morales
  • అధ్యక్షుడు ఆర్సె ఖండన

లాపాజ్‌ : బొలీవియా మాజీ అధ్యక్షుడు ఎవో మొరేల్స్‌పై గుర్తుతెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆదివారం కారులో వెళ్తుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ దాడి నుంచి ఆయన సురక్షితంగా బయటపడ్డారు. ఇది అధ్యక్షుడు లూయిస్‌ ఆర్సే పనేనని మొరేల్స్‌ విమర్శించారు. రాజకీయాల నుండి తనను పక్కకు తప్పించాలన్నది ప్రభుత్వ కుట్రగా వుందని, అందుకే వారు ఇటువంటి కుట్రలు పన్నుతున్నారని మొరేల్స్‌ విమర్శించారు. ఫాసిస్ట్‌ ప్రభుత్వ హయాంలో ప్రస్తుతం మనం ఉన్నామనడానికి స్పష్టమైన ఆధారాలున్నాయని మొరేల్స్‌కి చెందిన ఎంఎఎస్‌ చీలిక గ్రూపు ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది. నల్ల దుస్తులు ధరించి, భారీగా ఆయుధాలు కలిగిన వ్యక్తులు రెరడు వాహనాల్లో వచ్చి మొరేల్స్‌ కాన్వారుపై కాపుగాచి దాడి చేశారని ఆ ప్రకటన పేర్కొంది. మొరేల్స్‌ తలకు కొద్ది సెంటిమీటర్ల దూరం నుండి బుల్లెట్లు వెళ్లాయని, ఆయనకు తృటిలో ప్రాణాపాయం తప్పిందని తెలిపింది. ఇందుకు సంబంధించి వీడియో విడుదల చేసింది. ఈ సంఘటన జరిగినప్పుడు గగనతలంలో హెలికాప్టర్లు రొద కూడా వీడియోలో వినిపిస్తోంది. ఈ దాడిని అధ్యక్షుడు ఆర్సే ఖండించారు. వ్యక్తులను అంతమొందించడం వల్ల సమస్యలు పరిష్కారం కావని ఆయన ఎక్స్‌లో పోస్టు పెట్టారు. వచ్చే ఏడాది జరిగే ఎన్నికల్లో పార్టీకి ఎవరు నేతృత్వం వహించాలనే విషయంలో మొరేల్స్‌, ఆర్సేల మధ్య ఘర్షణ తలెత్తింది. మొరేల్స్‌ ప్రభుత్వ హయాంలో ఆర్సె ఆర్థిక మంత్రిగా పనిచేశారు.

➡️