జాబాలియా శరణార్థశిబిరంపై దాడి

  • వైమానిక, భూతల దాడుల్లో 43మంది మృతి
  • వీధుల్లో చెల్లాచెదురుగా మృత దేహాలు
  • దాడిలో హిజ్బుల్లా సీనియర్‌ కమాండర్‌ మృతి

గాజా/ బీరుట్‌ : లెబనాన్‌, గాజాల్లో ఇజ్రాయిల్‌ భీకర దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా గాజాలో జరిగిన దాడుల్లో 43మంది పాలస్తీనియన్లు మరణించారు. బీరుట్‌ దాడిలో హిజ్బుల్లా సీనియర్‌ కమాండర్‌ను హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ ప్రకటించింది. గాజాలోని జాబాలియా శరణార్థ్ధ శిబిరంలో వైమానిక దాడులతో పాటూ ఆర్మీ భూతల దాడులకు కూడా దిగింది. కాల్పులు జరుగుతుండడంతో భయంతో అరుస్తూ ప్రజలు అటూ ఇటూ పరుగులు తీసింది. వీధుల్లో ఎక్కడ చూసినా మృతదేహాలే. వైద్య బృందాలు అక్కడకు చేరుకోవడం కూడా కష్టసాధ్యంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో మీడియాకు చిక్కింది. పదాతి దాడుల్లో భాగంగా ఒక ఇజ్రాయిల్‌ సైనికుడిని హతమార్చామని, ఈలోగా థండర్‌ బాంబుతో ప్రత్యర్ధులు విరుచుకుపడ్డారని, దాంతో అల్‌ తవమ్‌ ఏరియాలో డజన్ల సంఖ్యలో ప్రజలు మరణించారని హమాస్‌ సాయుధ విభాగం ఖాసిమ్‌ బ్రిగేడ్స్‌ తెలిపింది. మరణించిన వారిలో ఏడుగురు పౌరులు వున్నారు. మొత్తంగా శరణార్ధ శిబిరాన్ని చుట్టుముట్టడంతో పరిస్థితి భయానకంగా మారింది. పలు రోజుల నుండి ఈ నిర్బంధం కొనసాగుతోంది. ఇప్పటివరకు గాజాలో మరణించిన వారి సంఖ్య 41,965కి చేరింది. గాయపడిన వారి సంఖ్య 97,590కి పెరిగింది. మరో 10వేల మృతదేహాలు భవన శిథిóలాల కింద వుండొచ్చని పాలస్తీనా ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇరాన్‌ నుండి అధునాతన ఆయుధాలు తెప్పించి, వాటిని వివిధ యూనిట్లకు పంపిణీ చేసే బాధ్యతలు నిర్వర్తించే కమాండర్‌ సొహైల్‌ హుస్సేనిని హత్య చేసినట్లు ఇజ్రాయిల్‌ మిలటరీ మంగళవారం తెలిపింది. దీనిపై హిజ్బుల్లా నుండి ఎలాంటి వ్యాఖ్యలు వెలువడలేదు. లెబనాన్‌లో వ్యాధులు పెచ్చరిల్లే ప్రమాదం వుందని డబ్ల్యుహెచ్‌ఓ హెచ్చరించింది. నిర్వాసితుల శిబిరాలు, ఆస్పత్రులు ఎక్కడ చూసినా క్షతగాత్రులతో పరిస్థితులు అధ్వానంగా మారాయని పేర్కొంది. డయేరియా, హెపటైటిస్‌ ఎ, కలుషిత నీటి వల్ల తలెత్తే ఇతర వ్యాధులు వచ్చే పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొంది.
తీరప్రాంత నగరమైన హైఫాపై వందకు పైగా రాకెట్లు పడినట్లు ఇజ్రాయిల్‌ ఆర్మీ ప్రకటించింది. కొన్ని రాకెట్లను ఇజ్రాయిల్‌ వైమానిక రక్షణవ్యవస్థలు అడ్డుకున్నాయని తెలిపింది. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని ఆర్మీ తెలిపింది.

➡️