సోమాలియాలో సైనిక స్థావరంపై దాడి

Feb 12,2024 11:07 #Somalia
Attack on military base in Somalia

ముగ్గురు యుఎఇ సైనికులు మృతి

దుబాయ్ : సోమాలియాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ముగ్గురు యుఎఇ సాయుధ దళాల సభ్యులు, ఒక బహ్రెయిన్‌ అధికారి మరణించినట్లు యుఎఇ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో ధ్రువీకరించింది. రెండు దేశాల మధ్య సైనిక సహకారంలో భాగంగా యుఎఇ, రిపబ్లిక్‌ ఆఫ్‌ సోమాలియా మధ్య ద్వైపాక్షిక ఒప్పందం ప్రకారం సోమాలియా రాజధానిలోని సైనిక స్థావరంలో అరబ్‌ ఎమిరేట్స్‌, బహ్రెయిన్‌ అధికారులు శిక్షణ పొందుతున్నారు. శనివారం మొగదిషులోని జనరల్‌ గోర్డాస్‌ మిలిటరీ స్థావరంపై సైనికులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడి తమ పనేనని అల్‌ ఖైడా అనుబంధ మిలిటెంట్‌ గ్రూపు అల్‌-షబాబ్‌ ప్రకటించింది. అల్‌-షబాబ్‌ను అణచివేసేందుకు యత్నిస్తున్న సోమాలియా ప్రభుత్వానికి యుఎఇ మద్దతు ఇచ్చినందున తాము ఎమిరేట్స్‌ను శత్రువుగా పరిగణించామని పేర్కొంది. సైనికుల కుటుంబ సభ్యులకు సోమాలియా రక్షణ మంత్రిత్వ శాఖ తన సంతాపాన్ని తెలియజేసింది. దాడిలో గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు సోమాలియా ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి యుఎఇ కట్టుబడి ఉందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

➡️