బ్రిటన్‌లో ఇమ్మిగ్రెంట్లపై దాడులు

Feb 11,2025 00:00 #Attacks, #Britain, #immigrants
  • 609మంది అరెస్టు
  • గతేడాదితో పోలిస్తే 48శాతం పెరిగాయన్న ప్రభుత్వం

లండన్‌ : అమెరికాలో మాదిరిగా బ్రిటన్‌లో కూడా చట్టవిరుద్ధంగా నివసిస్తూ, పనిచేస్తున్న వారిపై బ్రిటన్‌ ప్రభుత్వం కొరడా ఝళిపిస్తోంది. దేశవ్యాప్తంగా చేపట్టిన ఈ ఆకస్మిక ఆపరేషన్‌కు లక్ష్యాలుగా మారిన వాటిలో భారతీయ రెస్టారెంట్లు, నెయిల్‌ బార్‌లు, స్టోర్లు, కార్‌ వాష్‌లు వంటి సంస్థలు వున్నాయి. హోం కార్యదర్శి యెవెట్టె కూపర్‌ మాట్లాడుతూ, ఇమ్మిగ్రేషన్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బృందాలు రికార్డు స్థాయిలో 828 ప్రాంతాల్లో దాడులు జరిపాయని, 609మందిని అరెస్టు చేశారని తెలిపారు. గతేడాది జనవరితో పోల్చుకుంటే వీరి సంఖ్య 48శాతం పెరిగిందన్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా 73శాతం పెరిగిందన్నారు. దాదాపు అన్ని రంగాల్లో ఇలా సరైన పత్రాలు లేకుండా చట్టవిరుద్ధంగా పనిచేస్తున్న వారు వున్నారని, జనవరిలో ప్రధానంగా రెస్టారెంట్లు, టేక్‌ అవేలు, కేఫ్‌లు వంటి వాటిల్లో ఇటువంటి వారు పనిచేశారని తెలిపారు. ఆహారం, డ్రింక్స్‌, పొగాకు పరిశ్రమల్లో ఈ తరహాలో పనిచేసేవారు వుంటారన్నారు. ఉత్తర ఇంగ్లండ్‌లోని హంబర్‌సైడ్‌లో భారతీయ రెస్టారెంట్‌ను సందర్శిస్తే అక్కడ 11మంది వున్నారని, వారిలో ఏడుగురిని అరెస్టు చేశామని చెప్పారు. మరో నలుగురిని నిర్బంధ శిబిరాలకు పంపామన్నారు. ఏ దేశంలోనైనా ఇమ్మిగ్రేషన్‌ నిబంధనలు గౌరవించాలని, పాటించాలని హోం శాఖ కార్యాలయం వ్యాఖ్యానించింది.

➡️