ఆఫ్ఘన్‌లో జర్నలిస్టుల హక్కులపై దాడులు : యుఎన్‌

కాబూల్‌ :  2021లో ఆఫ్ఘన్ను తాలిబన్‌ హస్తగతం చేసుకున్నప్పటి నుండి జర్నలిస్టుల హక్కులపై దాడి జరుగుతోందని యుఎన్‌ పేర్కొంది. 300కి పైగా జర్నలిస్టులు హక్కుల ఉల్లంఘనలకు గురయ్యారని తెలిపింది. వారిపై పలు కేసులు బనాయించడంతో పాటు అరెస్టులతో హింసిస్తోందని వెల్లడించింది. మీడియా రంగం తాలిబన్‌ ప్రభుత్వానికి దాసోహమైందని, దీంతో తాలిబన్‌ ప్రభుత్వ కఠిన నిబంధనలతో జర్నలిస్టుల హక్కులను అణిచివేస్తోందని అంతర్జాతీయ సంస్థలు మండిపడుతున్నాయి.

యుఎన్‌ అసిస్టెన్స్‌ మిషన్‌ ఇన్‌ ఆఫ్ఘనిస్థాన్‌ (యుఎన్‌ఎఎంఎ), జెనీవాకు చెందిన మానవహక్కుల కార్యాలయం సంయుక్తంగా అధ్యయనం చేపట్టాయి. ప్రచురణపై నిషేధం, కఠిన ఆంక్షల వాతావరణంలో మీడియా సంస్థలు, జర్నలిస్టులు పనిచేస్తున్నాయని ఈ సర్వే తెలిపింది. 2021 ఆగస్టులో తాలిబన్‌లు ఆక్రమించుకున్నప్పటి నుండి ఈ సెప్టెంబర్‌ వరకు మానవ హక్కుల ఉల్లంఘన ఘటనలను యుఎన్‌ నివేదించింది. దీంతో 336 మంది జర్నలిస్టులు, మీడియా కార్యకర్తలు తీవ్రంగా ప్రభావితమయ్యారని పేర్కొంది. నిర్బంధం, అరెస్టు వంటి 256 ఘటనలు జరిగాయని, వేధింపులు, అగౌరవపరచడం వంటి 130 ఘటనలు జరిగాయని, 75 75 బెదిరింపు ఘటనలు జరిగాయని నివేదిక పేర్కొంది.
తాలిబన్‌ ఆక్రమించుకునే సమయానికి ఆఫ్ఘన్‌లో 1700 మంది మహిళలతో పాటు 8,400 మంది జర్నలిస్టులు ఉన్నారు. ప్రస్తుతం 560 మంది మహిళలతో కలిపి కేవలం 5,100 మంది మాత్రమే జర్నలిస్టులు ఉన్నారని పేర్కొంది.
2021 నుండి ఆఫ్ఘనిస్తాన్‌ 180 దేశాల ‘రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌’ పత్రికా స్వేచ్ఛ ర్యాంకింగ్‌లో 122వ స్థానం నుండి 178వ స్థానానిక పడిపోయిన సంగతి తెలిసిందే.

➡️