- ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణుల వర్షం
- జెరూసలెం, టెల్ అవీవ్‌లో పేలుళ్లు
టెహ్రాన్: హిజ్బుల్లా చీఫ్ నస్రల్లా హత్యకు కారణమైన ఇజ్రాయిల్‌కు ఇరాన్ దీటుగా బదులిచ్చింది. ఇజ్రాయిల్‌ను వణికించేలా డజన్ల కొద్దీ క్షిపణులను ప్రయోగించింది. ఇజ్రాయిల్ అణచివేత దాడులకు దీటుగా బదులిస్తామని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్సు (ఐఆర్‌జిసి) తెలిపింది. అమెరికా హెచ్చరించిన కొద్ది సేపటికే ఇరాన్ ఈ ప్రతీకార దాడుల పరంపర సాగించింది. టెల్ అవీవ్, జెరూసలెంలలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు వార్తలొస్తున్నాయి ఈ దాడుల్లో ఇద్దరు మాత్రమే గాయపడ్డారని, కొన్ని క్షిపణులను మార్గ మధ్యంలోనే అడ్డుకున్నామని ఇజ్రాయిల్ సైన్యం తెలిపింది. ఇరాన్ దాడుల నుంచి తనను తాను కాపాడుకునేందుకు ఇజ్రాయిల్ చేసే యత్నాలకు అమెరికా మద్దతు ఉంటుందని అధ్యక్షుడు జో బైడెన్ చెప్పారు. పశ్చిమాసియా అంతటా అమెరికా తన బలగాలను పెద్దయెత్తున మోహరించింది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులను కూల్చివేయాలని బైడెన్ అమెరికా సైన్యాన్ని ఆదేశించారు. పశ్చిమాసియాలో ఘర్షణలు విస్తరిస్తుండడం పట్ల ఐరాస చీఫ్ ఆంటోని గుటెరస్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
లెబనాన్‌పై భూతల దాడులకు దిగిన ఇజ్రాయిల్
హిజ్బుల్లా స్థావరాలను, కమాండర్లను లక్ష్యంగా చేసుకుని ఇప్పటివరకు వైమానిక దాడులతో విరుచుకుపడిన ఇజ్రాయిల్ ఇక భూతల దాడులు చేసేందుకు సిద్ధమైంది. దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయిల్ బలగాలు మంగళవారం చొచ్చుకువెళ్ళాయి. ఇజ్రాయిల్ సరిహద్దుకు సమీపంలోని గ్రామాల్లో లక్ష్యిత దాడులకు దిగుతున్నాయి. కాగా ఈ దాడులు స్థానికమైనవని, పరిమితమైనవని మిలటరీ చెబుతోంది. సరిహద్దు నుండి 60కిలోమీటర్ల మేరా విస్తరించిన ప్రాంతాల నుండి తక్షణమే ప్రజలు ఖాళీ చేయాలని ఆర్మీ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తర ప్రాంతంలో ఆపరేషన్ల కోసం మరిన్ని రిజర్వ్ బలగాలను ఇజ్రాయిల్ సమీకరిస్తోంది. దక్షిణ లెబనాన్‌లో లక్ష్యిత దాడులపై ఇజ్రాయిల్, అమెరికాకు సమాచారమందించింది. అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్‌తో ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ మిలటరీ ఆపరేషన్స్‌పై సవివరంగా చర్చించారని ఆయన కార్యాలయం పేర్కొంది. గాజాలో దాడులు ఆరంభమైనప్పటి నుండి పాలస్తీనాకు మద్దతుగా హిజ్బుల్లా, ఇజ్రాయిల్‌పై రాకెట్, క్షిపణుల దాడులకు దిగుతోంది. ఈ నేపథ్యంలో హిజ్బుల్లాపై ఒత్తిడి పెంచాలన్నది ఇజ్రాయిల్ ఆలోచనగా వుంది. 2006 తర్వాత ఇజ్రాయిల్ హిజ్బుల్లా మధ్య భూతల పోరు మళ్ళీ ఇప్పుడే జరుగుతోంది. కాగా దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయిల్ బలగాలు ప్రవేశించాయన్న వార్తలను హిజ్బుల్లా ఖండించింది. శత్రువుతో ప్రత్యక్షంగా పోరుకు దిగేందుకు తమ ఫైటర్లు సిద్ధంగా వున్నారని హిజ్బుల్లా గ్రూపు ప్రతినిధి మహ్మద్ అసిఫి తెలిపారు. ఇజ్రాయిల్‌లోని లక్ష్యాలపై మధ్యంతర శ్రేణి క్షిపణులు ప్రయోగిస్తున్నామని, ఇది కేవలం ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు.
ఇదిలావుండగా, ఇజ్రాయిల్‌పై బాలిస్టిక్ క్షిపణి దాడులకు దిగేందుకు ఇరాన్ సమాయత్తమవుతోందని అమెరికా అధికారులు తెలిపారు. దీనివల్ల ఇరాన్‌కే విపత్కర పర్యవసానాలు వుంటాయని హెచ్చరించారు.
ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే
కాగా, భూతల దాడులను ప్రపంచనేతందరూ ముక్త కంఠంతో ఖండించారు. ఇది ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమేనని వ్యాఖ్యానించారు. తక్షణమే కాల్పుల విరమణ జరగాలని పిలుపిచ్చారు. గాజా, లెబనాన్ ప్రజలకు అండగా వుంటూ హింస, దాడులు విరమించాలని యావత్ ప్రపంచం పిలుపిస్తూ వుంటే అమెరికా మాత్రం ఇజ్రాయిల్‌కు మద్దతు ప్రకటిస్తోంది. సైనిక పరంగా, ఆర్థిక పరంగా ఇజ్రాయిల్‌కు అండగా వుంటామని తెలిపింది.
లెబనాన్‌లోకి చొరబడి ఇజ్రాయిల్ దాడులు జరుపుతున్న తరుణంలో లెబనాన్ ప్రజలకు బాసటగా నిలబడతామని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ ప్రకటించారు. ఇటువంటి క్లిష్ట సమయంలో తమ లెబనాన్ సోదరులను విడిచిపెట్టలేమని అన్నారు. మరోవైపు లెబనాన్ నుండి బలగాలను ఉపసంహరించుకోవాల్సిందిగా ఇజ్రాయిల్‌ను రష్యా కోరింది. ఈ భూతల దాడుల వల్ల పరిస్థితులు మరింత దిగజారుతాయని, పశ్చిమాసియాలో హింస పెచ్చరిల్లే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎక్స్‌్‌లో పోస్టు పెట్టింది. మధ్య ప్రాచ్యంలో ఘర్షణలు పరిష్కరించుకోవడానికి శాంతియుత మార్గాలను అన్వేషించాల్సిందిగా కోరింది.
లెబనాన్‌పై భూతల దాడులకు దిగడమంటే ఆ దేశ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడమే అవుతుందని చైనా పేర్కొంది. ఇటువంటి చర్యలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది. సంబంధిత సైనిక చర్యల వల్ల ప్రాంతీయ ఉద్రికత్తలు పెచ్చరిల్లుతాయని ఆందోళన చెందింది.
ఐక్యరాజ్య సమితి తాత్కాలిక బలగాల (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్)కు చెందిన భారత బృందం దక్షిణ లెబనాన్‌లో మకాం వేసింది. 900మందికి పైగా సైనికులు వున్న భారత బెటాలియన్, ఇజ్రాయిల్ దాడులను ఎదుర్కొనడానికి సిద్ధంగా వుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
దక్షిణ లెబనాన్‌లోకి ఇజ్రాయిల్ బలగాలు చొచ్చుకు వెళ్ళి పరిమిత పదాతిదళ దాడికి దిగడమంటే ఇజ్రాయిల్ ఆత్మ రక్షణ హక్కు కిందకే వస్తుందని వాషింగ్టన్ వ్యాఖ్యానం చెప్పింది.
లెబనాన్‌లో చెలరేగుతున్న హింస ఏ ఒక్కరికీ మంచిది కాదని ఐక్యరాజ్య సమితి ప్రత్యేక సమన్వయకర్త జెనిన్ హెనిస్ వ్యాఖ్యానించారు. హింస ప్రమాదకర స్థాయిలకు చేరుతోందని అన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కతార్, జపాన్ సహా పలు దేశాలు ఇప్పటికే తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేశాయి.