ముఖ్య సలహాదారుగా మహ్మద్ యూనస్
గృహ నిర్బంధం నుంచి మాజీ ప్రధాని బేగం ఖలీదా జియా విడుదల
ప్రభుత్వ కూర్పుపై విద్యార్థి సంఘ నేతలతో ఆర్మీ చీఫ్ చర్చలు
తాత్కాలిక ప్రభుత్వ ఆధ్వర్యంలో పార్లమెంటు ఎన్నికలు : అధ్యక్షుడు వెల్లడి
ఢాకా : ఉవ్వెత్తున ఎగసిన విద్యార్ధుల ఆందోళనలు, హింస, నిర్బంధాల నడుమ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశాక తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు వీలుగా పార్లమెంటును రద్దు చేశారు. రక్షణ రంగానికి చెందిన అధిపతులు, వివిధ పార్టీల నేతలు, విద్యార్థి సంఘ నాయకులు, పౌర సమాజ ప్రతినిధులతో చర్చించిన మీదట పార్లమెంటును రద్దు చేయాలని నిర్ణయించినట్లు అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ తెలిపారు. తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్‌ను నియమించారు. ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ సైన్యం నేతృత్వం వహించే ఏ తాత్కాలిక ప్రభుత్వమూ తమకు ఆమోద యోగ్యం కాదని హసీనా వ్యతిరేక ఆందోళనలకు నాయకత్వం వహించిన విద్యార్థి సంఘం నేతలు మంగళవారం స్పష్టం చేయడంతో ఆర్మీ మల్లగుల్లాలు పడుతోంది. ఈ విషయమై ఆర్మీ చీఫ్ జనరల్ వకార్ ఉజ్ జమాన్ విద్యార్థి నేతలతో చర్చలు జరపనున్నట్లు మిలిటరీ వర్గాలు తెలిపాయి. నిరసనకారుల డిమాండ్ మేరకు మాజీ ప్రధాని, ప్రతిపక్ష బిఎన్‌పి నేత బేగం ఖలీదా జియాను గృహ నిర్బంధం నుంచి విడుదలజేశారు. ప్రజాతంత్రయుతంగా అధికార మార్పిడి జరగాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. సోమవారం హింసాత్మక ఘటనల్లో మరో 113 మంది చనిపోవడంతో గత నెల రోజులుగా సాగుతున్న ఈ ఆందోళనల్లో చనిపోయినవారి సంఖ్య 440కి పెరిగింది. రాజకీయ ఖైదీల విడుదల కోసం ఆ కుటుంబాలు ఎదురు చూస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నెలకొన్న రాజకీయ కల్లోలం నుంచి బంగ్లాదేశ్ ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మంగళవారం ఢాకా వీధుల్లో శాంతియుత పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. వాహనాల రాకపోకలు ఎప్పటిలానే సాగుతున్నాయి. నిలిచిపోయిన విమాన సర్వీసులను పునరుద్ధరించడంతో దుస్తుల తయారీ ఫ్యాక్టరీలు తిరిగి పనిచేయనారంభించాయి.
బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధం: యూనస్
తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా బాధ్యతలు చేపట్టేందుకు నోబెల్ బహుమతి గ్రహీత మహ్మద్ యూనస్ సుముఖత తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ”విద్యార్ధులు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నారు. అందుకు వారు మూల్యం కూడా చెల్లించారు. విద్యార్ధులే ఇంతలా త్యాగాలు చేస్తే, నేను కూడా కొంత బాధ్యత తీసుకుంటాను. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ముఖ్య సలహాదారుగా వుంటాను.” అని పేర్కొన్నారు.
హసీనాకు భారత్ సాయం: జైశంకర్
ఇదిలావుండగా, సోమవారం సాయంత్రం భారత్ చేరుకున్న పదవీచ్యుతురాలైన బంగ్లా ప్రధాని హసీనాకు సాయమందిస్తామని భారత్ హామీ ఇచ్చింది. మంగళవారం నాటి అఖిల పక్ష సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విషయం వెల్లడించారు. ప్రస్తుతం షాక్‌లో వున్న హసీనా తన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకునేందుకు కొంత సమయం తీసుకోనున్నారని తెలిపారు. బంగ్లాదేశ్‌లో వున్న 10వేల మందికిపైగా భారతీయ విద్యార్ధులు, 19వేలమందికి పైగా భారత పౌరుల భద్రతపై అక్కడి ఆర్మీతో మాట్లాడుతున్నట్లు చెప్పారు. అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. హసీనా ఒకటి రెండు రోజుల కన్నా భారత్‌లో వుండకపోవచ్చునని భావిస్తున్నారు. బ్రిటన్‌లో ఆశ్రయం కావాలని ఆమె కోరారని, దానికి ఆమోద ముద్ర రాగానే ఆమె వెళ్ళిపోతారని అధికారులు చెబుతున్నారు.
హోటల్‌కు నిప్పు పెట్టిన ఘటనలో
24కి చేరిన మృతుల సంఖ్య
విద్యార్థుల ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసలో తాజాగా జషోర్ జిల్లాలో అవామీ లీగ్ ప్రధాన కార్యదర్శి షాహిన్ చక్లాదర్‌కి చెందిన జబీర్ ఇంటర్నేషనల్ హౌటల్‌కు అల్లరి మూకలు నిప్పంటించిన ఘటనలో సజీవ దహనమైనవారి సంఖ్య 8 నుంచి 24కి పెరిగింది. అగ్నిమాపక సిబ్బంది హౌటల్‌కు రాకుండా అల్లరి మూక అడ్డుకోవడంతో పరిస్థితి మరింత భయానకంగా తయారైంది. హసీనా రాజీనామా చేసి దేశం వీడిన రోజునే దేశంలో 113మంది మరణించారు. మాజీ ప్రధాని, కీలక ప్రతిపక్ష నేత ఖలీదా జియాతో సహా పలువురు ఖైదీలను విడుదల చేస్తూ అధ్యక్షుడు షహబుద్దీన్ ఆదేశాలు జారీ చేశారు.
అమెరికా సుద్దులు !
దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్న సమయంలో ఏర్పడే తాత్కాలిక ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా వుండాలంటూ అమెరికా హితవు పలికింది. బంగ్లాదేశ్‌లో హసీనా ప్రభుత్వాన్ని కూలదోయడంలో అమెరికా హస్తం కూడా ఉందని వార్తలస్తున్నాయి. దేశ ప్రజల సంకల్పానికి తగినట్లుగా, చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పడాలని చెబుతోంది. ప్రభుత్వ భవితవ్యాన్ని నిర్ణయించేది అక్కడి ప్రజలేనని వ్యాఖ్యానిస్తూ, తాత్కాలిక ప్రభుత్వాన్ని స్వాగతించింది.
Bangladesh : బంగ్లాదేశ్ పార్లమెంట్ రద్దు ..తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు
