ఢాకా : బంగ్లాదేశ్‌కి చెందిన ఓ మహిళా జర్నలిస్ట్ మృతదేహాన్ని ఓ చెరువులో గుర్తించినట్లు స్థానిక మీడియా తెలిపింది. మృతదేహాన్ని ఢాకాలోని హతిర్‌జీల్ చెరువులో బుధవారం గుర్తించారు. ఆమె గాజి గ్రూప్ యాజమాన్యంలోని బెంగాలీ భాష శాటిలైట్ మరియు కేబుల్ టెలివిజన్ ఛానెల్ అయిన ‘గాజి టివి’ న్యూస్ రూమ్ ఎడిటర్ సారా రహనుమాగా గుర్తించినట్లు తెలిపింది.
మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఢాకా మెడికల్ కాలేజీ హాస్పిటల్ (డిఎంసిహెచ్) పోలీస్ అవుట్ పోస్ట్ ఇన్‌చార్జ్, ఇన్స్‌పెక్టర్ బచ్చుమియా తెలిపారు.
చెరువులో తేలుతున్న మృతదేహాన్ని గుర్తించానని, డిఎంసిహెచ్‌కి తరలించినట్లు సాగర్ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. ఆమె తెల్లవారుజామున 2.00 గంటల సమయంలో మరణించినట్లు వైద్యులు స్పష్టం చేశారని అన్నారు.
మంగళవారం చివరిసారిగా జర్నలిస్ట్ తన స్నేహితురాలికి ఫేస్‌బుక్‌లో సందేశం పంపినట్లు స్థానిక మీడియా తెలిపింది. త్వరలో నీ కలలన్నీ నిజం కావాలని, మనిద్దరం కలిసి చాలా ప్లాన్స్ వేసుకున్నాం. పూర్తి చేయలేకపోతున్నందుకు క్షమించు. అనిపోస్ట్ చేశారు. చావుతో సమానమైన జీవితాన్ని కొనసాగించడం కన్నా మరణించడం మేలు అని మరో పోస్ట్‌లో పేర్కొన్నారు.
ఘటన జరిగిన రోజు సారా ఆఫీసుకు వెళ్లి, ఇంటికి తిరిగి రాలేదని ఆమె భర్త మీడియాకు తెలిపారు. ఆమె సరస్సులో దూకినట్లు 3.00 గంటల సమయంలో సమాచారం అందిందని అన్నారు. కొతకాలంగా విడిపోవాలనుకుంటున్నామని, విడాకుల కోసం కాజీ కార్యాలయానికి వెళ్లాలనుకున్నాం.. కానీ దేశంలోని ప్రస్తుత పరిస్థితుల కారణంగా వాయిదా వేయాల్సివ చ్చిందని అన్నారు. అయితే ఆమె మృతి అనుమానాస్పదంగా ఉందని గాజి న్యూస్ పేర్కొంది.
జర్నలిస్ట్ మృతిపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మరో దారుణమైన హత్య అని దేశం నుండి పారిపోయిన మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజీద్ వాజద్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌లో భావప్రకటనా స్వేచ్ఛపై ఇది మరో క్రూరమైన దాడి. గాజి టివి వ్యవస్థాపకుడు గోలం దస్తగిరి ఘాజీని ఇటీవల అరెస్ట్ చేశారని ఎక్స్‌లో పేర్కొన్నారు.