ఇరాన్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు లేదా బెదిరింపులతో చర్చలు జరిగితే వాటిని తిరస్కరిస్తామని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ మంగళవారం తెలిపారు. ఇలా చేయవద్దు, అలా చేయవద్దు ఆదేశించి… మాట వినకపోతే ఇలా చేస్తామని ట్రంప్ బెదిరింపులు చేయడం ఆమోదయోగ్యం కాదని ఇరాన్ ఉత్పత్తిదారులు, వ్యవస్థాపకులతో జరిగిన సమావేశంలో పెజెష్కియాన్ అన్నారు. ఇటీవల ట్రంప్ ఇరాన్ సుప్రీం నాయకుడు ఆయతుల్లా అలీ ఖమేనీకి లేఖ రాస్తూ… టెహ్రాన్ తన అణు కార్యక్రమంపై కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని లేదా సైనిక చర్యను ఎదుర్కోవాలని బెదిరింపులకు దిగారు. ఇరాన్‌లో అంతిమ అధికారం కలిగి ఖమేనీ ఫిబ్రవరిలో ఇరాన్ అమెరికాతో చర్చలు జరపకూడదని అన్నారు. వాషింగ్టన్ అసలు ఒప్పందం నుండి వైదొలగడాన్ని ఉటంకిస్తూ దానిని “తెలివి తక్కువ పని” అని అన్నారు. ఇరాన్ ప్రపంచ దేశాల ఒప్పందాన్ని కోరుతుంది కానీ అవమానాన్ని అంగీకరించదని పెజెష్కియాన్ మంగళవారం పునరుద్ఘాటించారు.
