China : బోయింగ్‌ విమానాల డెలివరీ తీసుకోవద్దు

  • చైనా ఆదేశాలతో అమెరికా విమానయాన సంస్థ ఉక్కిరిబిక్కిరి

బీజింగ్‌ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు చైనా తనదైన శైలిలో ఝలక్‌ ఇస్తోంది. టారిఫ్‌ల పెంపుతో ఇప్పటికే ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్దం మరింత ముదరగా.. తాజాగా యుఎస్‌కు చెందిన అతిపెద్ద విమానాల తయారీ సంస్థ బోయింగ్‌ నుంచి ఎటువంటి డెలివరీలను స్వీకరించవద్దని ఆదేశించింది. అదే విధంగా విమాన యాన రంగంలో ఉపయోగించే ఎలాంటి విడి భాగాలను అమెరికా నుంచి కొనుగోలు చేయవద్దని తెలిపింది. ఇందుకు ప్రత్యామ్నాయ మార్గాలను కల్పించనున్నట్లు విమాన సంస్థలకు హామీ ఇచ్చింది. ట్రంప్‌ ఇటీవల చైనాపై 145 శాతం సుంకాలు వేయగా.. అదే ప్రతీకారంతో చైనా కూడా 125 శాతం సుంకాలు వేసి అమెరికాకు పెను సవాల్‌ను విసిరింది. గత వారం చైనా మినహా అన్ని దేశాలపై పెంచిన సుం కాల అమలును ట్రంప్‌ తాత్కాలికంగా నిలిపేశారు. ఈ అంశంలోనూ చైనా ఆగ్రహంగా ఉంది. తాజాగా అమెరికా నుంచి చైనా తీసుకునే బోయింగ్‌ విమానాల డెలివరీలను నిలిపివేయాలని ఆ దేశ విమానయాన తయారీ సంస్థలను ఆదేశించింది. చైనా- అమెరికా వాణిజ్య యుద్ధం దెబ్బకు బోయింగ్‌ పరిస్థితి దారుణంగా మారిందని రిపోర్టులు వస్తోన్నాయి. ఇప్పటికే ఆ సంస్థ గత కొన్నేళ్లుగా నష్టాల్లో కొనసాగుతోంది. బోయింగ్‌కు చైనా అతిపెద్ద మార్కెట్‌గా ఉంది. వచ్చే 20 ఏళ్లలో ఈ రంగంలో చైనా వాటా 20 శాతంగా ఉండొచ్చని అంచనా. 2018లో బోయింగ్‌ మొత్తం ఆర్డర్లలో చైనా 25 శాతం వాటాను కలిగి ఉన్నాయి. చైనా తాజా నిర్ణయంతో బోయింగ్‌ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇటీవల అరుదైన ఖనిజాలు, మాగెట్‌ల ఎగుమతులను చైనా నిలిపివేయడంతో అమెరికా నానా అవస్థలు పడుతోంది.

➡️