Biden: ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు పోటీ నుండి వైదొలిగా : బైడెన్‌

వాషింగ్టన్‌ : ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకే తాను అధ్యక్ష రేసు నుండి వైదొలిగినట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ ప్రకటించారు. బుధవారం రాత్రి వైట్‌హౌస్‌లోని ఓవల్‌ కార్యాలయం నుండి టెలివిజన్‌లో ప్రసంగించారు. తాను సాధించిన విజయాల గురించి మాట్లాడారు. తన మూలాల గురించి మాట్లాడారు. అమెరికా ప్రజలను ప్రశంసించారు. అమెరికా ప్రజాస్వామ్య భవిష్యత్తు అమెరికన్ల చేతుల్లోనే ఉందని అన్నారు. తన పార్టీని ఏకం చేయాల్సిన అవసరం ఉందని ఇటీవల గుర్తించినట్లు తెలిపారు. కొత్త తరాలకు మార్గ నిర్దేశం చేయాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడంలో ఏదీ అడ్డంకి కాదని, వ్యక్తిగత ఆశయం కూడా అదేనని అన్నారు. కమలా హారిస్‌ అనుభవజ్ఞురాలు, సమర్థురాలని అన్నారు. అద్భుతమైన తన భాగస్వామి దేశానికి అధ్యక్షురాలు కాగల సామర్థ్యం కలిగి ఉన్నారని అన్నారు. ఇటీవల ట్రంప్‌తో చర్చలో పేలవమైన ప్రదర్శన, డెమొక్రాట్ల నుండే వ్యతిరేకత నవంబర్‌ ఎన్నికల్లో బైడెన్‌ విజయావకాశాలపై సందిగ్ధత నెలకొంది. అధ్యక్ష అభ్యర్థిగా బైడెన్‌ను సొంత పార్టీలోనే పలువురు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే.

➡️