ఖాట్మండు : నేపాల్ ప్రధాని మరోసారి పార్లమెంటు విశ్వాసాన్ని కోరనున్నారు. నేపాలీ కాంగ్రెస్‌తో మొన్నటివరకు సంకీర్ణ ప్రభుత్వం నడిపిన ఆయన గత వారం ఆ సంకీర్ణానికి గుడ్‌బై చెప్పి, పాత మిత్రులు కెపి శర్మ ఓలి నేతృత్వీంలోని నేపాలీ కమ్యూనిస్టు పార్టీ (యుఎంఎల్)తో చేతులు కలిపి కొత్త సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహించారు. ఈ నేపథ్యంలో పార్లమెంటులో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉన్నందున ఈ నెల 13న బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆయనకు ఇది మూడో దఫా విశ్వాస పరీక్ష. ఏ మిత్రపక్షమైనా మద్దతు ఉపసంహరించుకున్న పక్షంలో ప్రధాన మంత్రులు 30 రోజుల్లోగా సభా విశ్వాసాన్ని కోరాలని నేపాల్ రాజ్యాంగ నిబంధనలు పేర్కొంటున్నాయి. శనివారం దీనిపై తన సన్నిహితులతో ప్రచండ చర్చించారు. 13వ తేదీన పార్లమెంట్ దిగువ సభలో జరిగే ఓటింగ్‌కు తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా సభ్యులందరికీ విప్ జారీ చేయాలని సిపిఎన్-మావోయిస్ట్ సెంటర్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. 275మంది సభ్యులు గల ప్రతినిధులసభలో కొత్త సంకీర్ణానికి తగిన మెజారిటీ వుందని నేపాల్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.
