బీజింగ్ : చైనా చేపట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివ్ (బిఆర్‌ఐ)లో తాము చేరకపోయినా కూడా ఆ దేశంలో ప్రత్యామ్నాయ పద్ధతుల్లో సత్సబంధాలను మరింత ఉన్నతస్థాయిలో కొనసాగిస్తామని బ్రెజిల్ ప్రకటించింది. అయితే భారత్ తర్వాత ఈ మెగా ప్రాజెక్టులో చేరని రెండో బ్రిక్స్ దేశంగా బ్రెజిల్ నిలిచిందంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. బిఆర్‌ఐలో చేరరాదని బ్రెజిల్ అధ్యక్షులు లూలా డసిల్వా నిర్ణయించారని, కానీ అందుకు ప్రతిగా చైనా పెట్టుబడిదారులతో పరస్పర సహకారానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలని ఆయన భావిస్తున్నట్లు అంతర్జాతీయ వ్యవహారాల ప్రత్యేక సలహాదారు సెల్సో అమోరిమ్ తెలిపారు. బిఆర్‌ఐలో చేరకుండానే చైనాతో సంబంధాలను కొత్త స్థాయికి తీసుకెళ్లాలని బ్రెజిల్ కోరుకుంటోందని ఆయన చెప్పారు.