మారిషస్‌కు చాగోస్‌ దీవులను అప్పగించిన బ్రిటన్‌

లండన్‌ : చాగోస్‌ దీవుల సార్వభౌమాధికారాన్ని మారిషస్‌కు అప్పగిస్తున్నట్లు బ్రిటన్‌ ప్రకటించింది. దశాబ్దాల క్రితం నిర్వాసితులైన ప్రజలు తిరిగి వారి ఇళ్ళకు రావడాన్ని అనుమతించేందుకు కుదిరిన ఒప్పందం మేరకు ఈ ప్రకటన వెలువడింది. అయితే డిగో గార్షియాలో బ్రిటీష్‌-యుఎస్‌ మిలటరీ స్థావరాన్ని వినియోగించుకునే హక్కును బ్రిటన్‌ తన వద్దే అట్టిపెట్టుకుంది. అమెరికాతో కలిసి సంయుక్తంగా నిర్వహించే ఈ వ్యూహాత్మకమైన సైనిక స్థావరం డిగో గార్షియాను ఈ ఒప్పందం పరిరక్షిస్తోందని బ్రిటన్‌ గురువారం తెలిపింది. డిగో గార్షియా మిలటరీ బేస్‌ దీర్ఘకాలిక కార్యకలాపాలు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో నేడు కుదుర్చుకున్న ఒప్పందం, కీలకమైన సైనిక స్థావరం భవితవ్యానికి హామీ కల్పించిందని బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్‌ లామీ ఒక ప్రకటనలో తెలిపారు.

➡️