Britain : క్రూర చట్టాల రద్దుకై ఒత్తిడి

  • లండన్‌లో నిరసన ప్రదర్శన

లండన్‌: ప్రజాతంత్ర యుతంగా చేపట్టే నిరసనలను అణచివేయడానికి టోరీలు తీసుకొచ్చిన క్రూరమైన చట్టాలను రద్దు చేయాలని, భావ ప్రకటనా స్వేచ్ఛను కాపాడాలని కోరుతూ ఇటీవల లండన్‌లో పాలస్తీనా అనుకూల శాంతి సంఘాలు, పర్యావరణ, పౌర హక్కుల సంస్థల ఆధ్వర్యాన ప్రదర్శన జరిగింది. అనంతరం కొత్త మంత్రులను కలసి వారు ఒక విజ్ఞాపనా పత్రాన్ని అందజేశారు. అసమ్మతి గొంతు నొక్కే దుర్మార్గమైన చట్టాలను వెంటనే రద్దు చేయాలని, భావ ప్రకటనా స్వేచ్ఛ ఛాంపియన్లుగా నిలవాలని వారు ఆ మెమోరాండంలో విజ్ఞప్తి చేశారు. యూరప్‌ అంతటా శాంతియుత ప్రదర్శనలపై దాడులు పెరుగుతున్నాయని, వాక్‌ స్వాతంత్య్రం హరించుకుపోతోందని ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్‌ తన తాజా నివేదికలో ఆందోళన వ్యక్తం చేసింది.

ముస్లింల మొర ఆలకించని స్టార్మర్‌
బ్రిటన్‌ కొత్త ప్రధాని కీర్‌ స్టార్మర్‌ తమ ఆందోళనలను అంతగా పట్టించుకోవడం లేదనే భావన దేశమంతటా ముస్లింలలో నెలకొంది. లేబర్‌ పార్టీకి సీట్లు పెరిగినా, ఓట్లు అంతగా పెరగకపోవడానికి, పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన నలుగురు ముస్లిం ఎంపీలు లేబర్‌ పార్టీ అభ్యర్థులపైనే గెలవడం, మరి కొన్ని చోట్ల గట్టి పోటీ ఇవ్వడం దీనినే సూచిస్తోంది. ఇస్లామిక్‌ ఫోబియో, వలసలుపై ఆయన తీసుకున్న వైఖరి ముస్లింలలో ఈ అసంతృప్తికి ఒక ముఖ్య కారణమని తెలుస్తోంది. బంగ్లాదేశీయులను బహిష్కరించాలంటూ స్టార్మర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయనలోని ఇస్లామిక్‌ ఫోబియోకు దర్పణం పడుతున్నాయని విమర్శకులు పేర్కొన్నారు. గాజాలో ఇజ్రాయిల్‌ యథేచ్ఛగా సాగిస్తున్న మారణ హోమాన్ని సమర్థించడం, కాల్పుల విరమణ పిలుపు ఇవ్వడానికి నిరాకరించడం, ఇజ్రాయిల్‌కు ఆయుధ అమ్మకాలను నిలిపివేయడానికి తిరస్కరించడం, పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తించేందుకు ససేమిరా అనడం వంటివి స్టార్మర్‌ ముస్లిం వ్యతిరేక వైఖరికి కొన్ని ఉదాహరణలు.

రక్షణ రంగానికి పెద్ద పీట
రానున్న బడ్జెట్‌లో రక్షణ రంగానికి పెద్ద పీట వేస్తామని బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ ప్రకటించారు. వాషింగ్టన్‌లో నాటో మూడు రోజుల సదస్సులో పాల్గొనేందుకు బయల్దేరి వెళ్లే ముందు ఆయన లండన్‌లో ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ స్థూల జాతీయోత్పత్తి (జిడిపి)లో 2.5 శాతం నిధులు కేటాయిస్తామని చెప్పారు. చాలా యూరోపియన్‌ దేశాలు 2 శాతం కేటాయించడానికే సతమతమవుతున్న స్థితిలో బ్రిటన్‌లో లేబర్‌ పార్టీ ప్రభుత్వం ఈ ప్రకటన చేయడం పలు విమర్శలకు తావిచ్చింది.
ఉక్రెయిన్‌ యుద్ధం గురించి ప్రస్తావిస్తూ, ఈ విషయంలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. ఉక్రెయిన్‌కు 1600 కోట్ల డాలర్ల సైనిక సాయం అందించనున్నట్లు తెలిపారు.

➡️