పామ్ బీచ్ : అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌తో భేటీ కావడానికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడే శనివారం ఫ్లోరిడా చేరుకున్నారు. అయితే ఆకస్మికంగా జరుగుతున్న ఈ భేటీకి టారీఫ్ హెచ్చరికలే కారణమని భావిస్తున్నారు. ట్రంప్ ఎస్టేట్‌లో ఆయనతో కలిసి విందు సమావేశంలో పాల్గొంటారు. కెనడా దిగుమతులపై టారిఫ్‌లను పెంచుతామని ట్రంప్ హెచ్చరించిన నేపథ్యంలో వీరి సమావేశం జరగనుంది. ట్రంప్ హెచ్చరికల ప్రభావాన్ని అటు మెక్సికో, ఇటు కెనడాలు ప్రయత్నిస్తున్నాయి. ఇదిలావుండగా కొన్ని అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు విధించే అంశాన్ని కెనడా కూడా పరిశీలిస్తోంది. ట్రంప్ హెచ్చరికల వల్ల తలెత్తే ఆర్థిక ప్రభావాన్ని తగ్గించుకునేందుకు కెనడా ప్రయత్నిస్తోంది. కెనడా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా అమెరికాపై ఆధారపడి వుంది. దాదాపు 75 శాతం ఎగుమతులు అమెరికాకే వెళతాయి. ఈ వాణిజ్యంలో ఏ మాత్రం అంతరాయం కలిగినా అది సుదూర కాలంలో తీవ్ర పర్యవసానాలను కలగచేస్తుంది. పైగా ట్రూడే దేశీయంగా కూడా రాజకీయ, ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటున్నారు. ట్రంప్ బెదిరింపుల వల్ల అమెరికా, కెనడా, మెక్సికో దేశాలతో సంబంధాలు దెబ్బ తింటాయని బైడెన్ ఇప్పటికే వ్యాఖ్యానించారు.