త్వరలో హెచ్‌-1బి వీసాల ఆటోమేటిక్‌ రెన్యువల్‌ రద్దు?

  • రిపబ్లికన్ల తీర్మానం ఆమోదిస్తే భారతీయులపై తీవ్ర ప్రభావం

వాషింగ్టన్‌ : హెచ్‌-1బి, ఎల్‌ 1 వంటి వర్క్‌ వీసాల పొడిగింపును ట్రంప్‌ సర్కార్‌ త్వరలో రద్దు చేసే అవకాశం వుంది. అమెరికాలో ఉద్యోగాలు చేసుకోవడానికి అవకాశం కల్పించే ఈ వీసాల ఆటోమేటిక్‌ రెన్యువల్‌ కాలాన్ని అప్పటికి వున్న 180 రోజుల నుండి 540 రోజులకు పెంచుతూ బైడెన్‌ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ రిపబ్లికన్‌ సెనెటర్లు జాన్‌ కెన్నడీ, రిక్‌ స్కాట్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఇమ్మి గ్రేషన్‌పై, కఠినమైన వర్క్‌ వీసా నిబంధనలపై ట్రంప్‌ సర్కార్‌ తీవ్రమైన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో బైడెన్‌ కాలం నాటి ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని సెనెటర్లు కోరారు. వీసాల పొడిగింపును ట్రంప్‌ రద్దు చేస్తే అత్యధిక ప్రభావం భారతీయులపై పడుతుంది. అమెరికాలో 3,86,000మందికి హెచ్‌-1బి వీసాలు జారీ చేయగా, వారిలో 72.3శాతం మంది భారతీయులే. 2022లో ఈ సంఖ్య 77శాతంగా వుంది. 2024లో అమెరికా పౌరసత్వం లేదా గ్రీన్‌ కార్డులు తీసుకున్న రెండో అతిపెద్ద గ్రూపు భారతీయులే. వీరి సంఖ్య 49,700గా వుంది.

➡️