ఆరుగురు అభ్యర్థుల్లో ఇరాన్‌ తదుపరి అధ్యక్షుడు ఎవరు కానున్నారు.. !

టెహ్రాన్‌ :    ఇరాన్‌ తదుపరి అధ్యక్షుడుగా ఎవరు పోటీలో నిలవనున్నారనే  అంశంపై  సందిగ్థత నెలకొంది. అధ్యక్ష పదవి కోసం పోటీ పడేందుకు ఆరుగురు అభ్యర్థులు ఆమోదం పొందారు. వీరంతా ఇరాన్‌ సుప్రీం నేత అయతుల్లా ఖమేనీ, దేశ రాజకీయ వ్యవస్థకు మద్దతుగా విశ్వాసంగా ఉన్నట్లు తెలుస్తోంది.  ఇరాన్‌ సుప్రీం నేత తరువాత రెండవ అత్యంత శక్తివంతమైన స్థానంలో అధ్యక్షుడు ఉండనున్నారు.

గాజాపై ఇజ్రాయిల్‌ యుద్ధంతో ఇరాన్‌లో ప్రాంతీయ సంక్షోభం నెలకొంది. మరోవైపు హిజాబ్‌ ధరించలేదంటూ నైతిక పోలీసుల కస్టడీలో మాహ్సా అమ్ని మరణించడంతో ఆందోళనలతో దేశం అట్టుడికింది. పోలీసులు, భద్రతా దళాలతో ఆందోళనలను అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా యత్నించింది. వేలాది మందిని అదుపులోకి తీసుకుంది.

గత నెల విమాన ప్రమాదంలో ఇరాన్‌ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ మరణించడంతో 2025లో జరగాల్సిన ఎన్నికలు జూన్‌ 28న నిర్వహించనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

 అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు 

పార్లమెంట్‌ స్పీకర్‌, టెహ్రాన్‌ మాజీ మేయర్‌ మొహమ్మద్‌ బఘర్‌ ఘలీబఫ్‌ అధ్యక్ష పదవి కోసం పోటీపడుతున్నారు. ఆయన మాజీ ఇస్లామిక్‌ రివల్యూషనరీ గార్డ్‌ కాప్స్‌ (ఐఆర్‌జిసి) ఎయిర్‌ ఫోర్స్‌ కమాండర్‌గా పనిచేశారు.
ఎక్సెపెండెన్సీ డిస్క్రిమెంట్‌ కౌన్సిల్‌ మెంబర్‌, న్యూక్లియర్‌ నెగొటేటర్‌ మాజీ చీఫ్‌ సయీద్‌ జలీల్‌ రెండవ అభ్యర్థిగా ఉన్నారు.   టెహ్రాన్‌ మేయర్‌ అలిరెజా జకానీ, పార్లమెంట్‌ మెంబర్‌ మసౌద్‌ పెజెష్కియాన్‌, మాజీ అంతర్గత, న్యాయ మంత్రి ముస్తఫా, ఇరాన్‌ ఫౌండేషన్‌ హెడ్‌ అమిర్‌ హుస్సెన్‌ ఘజిజాదే హషేమీలు  అభ్యర్థులుగా ఉన్నారు.

ఎన్నికల అధికారులు నిర్దేశించిన వ్యవధిలో అభ్యర్థులు తమ పత్రాలను సమర్పించిన తర్వాత వారందరినీ గార్డియన్‌ కౌన్సిల్‌ పరిశీలిస్తుంది. ఎవరు పోటీ చేయవచ్చనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇరాన్‌లో గణనీయమైన అధికారాలను కలిగిన 12 మంది సభ్యులతో కూడిన కమిటీని గార్డియన్‌ కౌన్సిల్‌గా వ్యవహరిస్తారు.

➡️