హిజ్బుల్లాతో కాల్పుల విరమణ ఒప్పందం

Nov 27,2024 23:58 #agreement, #ceasefire, #Hezbollah
  • అమలు ప్రారంభం
  • 60రోజుల్లోగా సరిహద్దుల నుండి ఇజ్రాయిల్‌ బలగాల ఉపసంహరణ
  • త్రైపాక్షిక యంత్రాంగం అమలు పర్యవేక్షణ

జెరూసలేం, బీరుట్‌ : ఇజ్రాయిల్‌, హిజ్బుల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారం తెల్లవారు జాము నుండి అమల్లోకి వచ్చింది. అమెరికా, ఫ్రాన్స్‌ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఈ ఒప్పందాన్ని ఇరు పక్షాలు ఆమోదించాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారు జామున 4గంటల నుండి కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. 60రోజుల్లోగా తన బలగాలను ఇజ్రాయిల్‌ క్రమంగా ఉపసంహరిస్తుంది. ఆ స్థానంలో లెబనాన్‌ ఆర్మీ బాధ్యతలు చేపడుతుంది.
ఒప్పంద నిబంధనల ప్రకారం, 60రోజుల్లోగా ఇజ్రాయిల్‌, గోలాన్‌ హైట్స్‌తో లెబనాన్‌ను విభజిస్తున్న బ్లూ లైన్‌ వద్ద మోహరించబడిన హిజ్బుల్లా కార్యకర్తల స్థానే లెబనాన్‌ సాయుధ బలగాలను నియమించాలి. ఆ ప్రాంతం నుండి క్రమంగా ఇజ్రాయిల్‌ ఆక్రమణ బలగాలు కూడా వైదొలగాలి. అక్కడ శాంతి పరిరక్షణ బలగాలకు చోటు లేదు. ప్రస్తుతమున్న త్రైపాక్షిక యంత్రాంగాన్ని అమెరికా, ఫ్రాన్స్‌ పర్యవేక్షిస్తాయి. ఈ యంత్రాంగంలో ఇజ్రాయిల్‌, లెబనాన్‌ ప్రతినిధులతో పాటూ లెబనాన్‌లో ఐక్యరాజ్య సమితి తాత్కాలిక బలగాలు (యుఎన్‌ఐఎఫ్‌ఐఎల్‌) ప్రతినిధులు కూడా వుంటారు.
కాగా శాశ్వతంగా కాల్పుల విరమణకు ఈ ఒప్పందం ఉద్దేశించబడిందని అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయిల్‌ ఆక్రమణలకు ఈ ఒప్పందంతో ఏమాత్రమూ సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఈ ఒప్పందం వల్ల హమాస్‌పై ఒత్తిడి పెంచాలన్నది అమెరికా, ఇజ్రాయిల్‌ లక్ష్యంగా వుంది.
కాల్పుల విరమణకు ముందుబీరుట్‌పై ఇజ్రాయిల్‌ భీకర వైమానికదాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో 10మంది మరణించగా, 35మంది గాయపడ్డారు. సరిహద్దు ప్రాంతాల నుండి ఇజ్రాయిల్‌ ఆర్మీ పూర్తిగా వైదొలగేవరకు పౌరులెవరూ ఇళ్లకు తిరిగి రావద్దని కోరింది. గతేడాది అక్టోబరులో గాజాపై ఇజ్రాయిల్‌ దాడి ప్రారంభమైనప్పటి నుండి జరిగిన దాడుల్లో 3823మంది మరణించగా, 15,859మంది గాయపడ్డారు. చర్చలు జరిపేందుకు సైనిక బలగాలు అవకాశం ఇవ్వాల్సి వుందని, ఆ అవకాశం ఇప్పుడు లభించిందని ఫ్రాన్స్‌ విదేశాంగ మంత్రి జేన్‌ నోయల్‌ బారట్‌ వ్యాఖ్యానించారు.
కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇజ్రాయిల్‌ కేబినెట్‌ 10-1 ఓట్ల తేడాతో ఆమోదించిన తర్వాత మంగళవారం పొద్దుపోయిన ప్రధాని నెతన్యాహు టెలివిజన్‌లో ప్రసంగించారు. లెబనాన్‌లో జరిగే పరిణామాలపై కాల్పుల విరమణ ఎంత కాలం అమల్లో వుంటుందనేది ఆధారపడి వుంటుందని ఆయన స్పష్టం చేశారు. హిజ్బుల్లా ఒప్పందాన్ని ఉల్లంఘించి, తిరిగి ఆయుధాలు చేబూనడానికి ప్రయత్నిస్తే కచ్చితంగా తాము దాడి చేస్తామని ఆయన నొక్కి చెప్పారు. రాకెట్‌ ప్రయోగించినా, సొరంగం తవ్వినా, క్షిపణుల ట్రక్కును తీసుకువచ్చినా ఇలా ఏ చర్యలు చేపట్టినా దాడి తప్పదని హెచ్చరించారు. బైడెన్‌ కూడా ఇజ్రాయిల్‌ ఆత్మ రక్షణ హక్కు అంటూ దీన్ని సమర్ధించారు.
అంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందానికి జరుగుతున్న కసరత్తుపై లెబనాన్‌ పార్లమెంట్‌ డిప్యూటీ స్పీకర్‌ ఎలియాస్‌ బుసాబ్‌ మాట్లాడుతూ, నెతన్యాహు లాంటి వ్యక్తితో ఏ విషయంపై కూడా హామీ వుండదని వ్యాఖ్యానించారు.
ఇజ్రాయిల్‌ ఎందుకు ఆమోదించింది ?
దాదాపు 14 మాసాలుగా ఇజ్రాయిల్‌ సైనిక బలగాలు గాజా, లెబనాన్‌ల్లో సాగిస్తున్న దాడుల్లో భయంకరమైన నష్టాలను చవిచూస్తున్నాయి. పైగా అంతర్జాతీయంగా ఇజ్రాయిల్‌ ఒంటరిదైపోయింది. ఇజ్రాయిల్‌పై ఆయుధ ఆంక్షలు విధించాలని పలు దేశాలు డిమాండ్‌ చేస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం నెతన్యాహు అరెస్టుకు వారంట్లు కూడా జారీ చేసింది. పైగా నెతన్యాహు ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత ఉద్రిక్తతలు కూడా మరో కారణంగా వున్నాయి. ఈ అన్ని కారణాలతో కాల్పుల విరమణ ప్రతిపాదనను అంగీకరిస్తూ, తాము విజయం సాధించామని చెప్పుకోవాలని నెతన్యాహు భావిస్తున్నారు.

➡️