విల్నియస్ : లిథువేనియా సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిపక్షమైన మధ్యేవాద వామపక్ష పార్టీల కూటమి విజయం సాధించింది. ఆదివారం జరిగిన జాతీయ ఎన్నికల తుది రౌండ్‌లో మితవాద పాలక సంకీర్ణంపై మధ్యేవాద, వామపక్ష పార్టీలు పై చేయి సాధించాయి. 141 సీట్లు ఉన్న పార్లమెంట్‌లో సోషల్ డెమోక్రాట్లు 52సీట్లు గెలుచుకున్నారు. . దీంతో మితవాద ప్రధాని ఇంగ్రిడా సిమొనైట్ నేతృత్వంలో నాలుగేళ్ళ పాలనకు తెరపడింది. మరో రెండు చిన్న పార్టీలైన డెమోక్రటిక్ యూనియన్ 14 సీట్లు, యూనియన్ ఆఫ్ పెజంట్స్ అండ్ గ్రీన్స్ 8 సీట్లను గెలుచుకున్నాయి. వీటితో కలిసి సోషల్ డెమోక్రాట్లు మెజారిటీ మంత్రివర్గ ఏర్పాటుపై చర్చలు జరపనున్నారు. ఈ సంకీర్ణానికి 74 స్థానాలు లభిస్తాయి. రెండు రౌండ్లుగా జరిగిన ఈ ఎన్నికలో పాలక సంకీర్ణం 28సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ప్రజలు మార్పును కోరుకున్నారని, పూర్తి భిన్నమైన ప్రభుత్వం కావాలని అనుకున్నారని ఈ ఫలితాలతో వెల్లడైందని సోషల్ డెమోక్రాట్ నేత విలిజా బ్లింక్‌విసిటె వ్యాఖ్యానించారు.