దక్షిణ గాజాలో ఆహార పంపిణీ నిలిపివేత

ఇజ్రాయిలే కారణమన్న డబ్ల్యుఎఫ్‌పి
న్యూయార్క్‌ : సెంట్రల్‌ గాజాలో అమెరికా నిర్మించిన ఫ్లోటింగ్‌ డాక్‌ ద్వారా ఆహార పంపిణీని నిలిపివేసినట్లు ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యుఎఫ్‌పి) సోమవారం తెలియచేసింది. తమ సిబ్బంది భద్రతపై ఆందోళనలు తలెత్తడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలిపింది. డబ్ల్యుఎఫ్‌పి గోదాముల సముదాయంపై కూడా రాకెట్ల దాడి జరిగిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది. గాజాలోకి మరింత సాయాన్ని పంపించేందుకు వీలుగా అమెరికా మిలటరీ తాత్కాలికంగా ఈ నిర్మాణాన్ని చేపట్టింది. ఇజ్రాయిల్‌ దిగ్బంధనంలో వున్న గాజా ఉత్తరప్రాంతం పూర్తిగా కరువు బారిన పడిందని, ఇప్పుడు మళ్లీ ఆటువంటి క్షామ పరిస్థితులు దక్షిణ గాజాలో చోటుచేసుకుంటున్నాయని డబ్ల్యుఎఫ్‌పి తెలిపింది. ఇజ్రాయిల్‌ కావాలనే ఆహార సరఫరాలను అందనివ్వడం లేదని ఐక్యరాజ్య సమితి విమర్శించింది.. ఈ పరిస్థితుల్లో తాత్కాలికంగానే తాము ఆహార సరఫరాలను నిలిపివేశామని ఆ గ్రూపు తెలిపింది. సిబ్బంది, భాగస్వాముల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొంది. శనివారం జరిగిన దాడిలో సంస్థకు చెందిన రెండు గిడ్డంగులపై రాకెట్ల దాడి జరిగిందని, ఒకరు గాయపడ్డారని ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ సిండీ మెక్‌కెయిన్‌ మీడియాకు తెలిపారు. భద్రతా కారణాల రీత్యానే ఒక్క అడుగు వెనకేయాల్సి వచ్చిందన్నారు. ఏప్రిల్‌లో నిర్మాణం ఆరంభించి మే మధ్యలో పూర్తి చేసుకున్న ఈ ఫ్లోటింగ్‌ డాక్‌కు తుపాను కారణంగా నష్టం జరగడంతో ఒక వారం పనులు ఆగిపోయాయి. గత శుక్రవారమే మరమ్మత్తులు పూర్తయ్యాయి. శనివారం దాదాపు 500 మెట్రిక్‌టన్నుల ఆహారం దిగుమతి అయింది. అయితే భీకర దాడుల కారణంగా ఆహార పంపిణీ ఆపివేశారు.

➡️