- వలసదారులకు తొలగని కష్టాలు
న్యూఢిల్లీ : సరైన పత్రాలు లేని వలసదారుల్ని స్వదేశం తిప్పిపంపుతున్న అమెరికా వారిపై అమానవీయంగా ప్రవర్తించడం మానడం లేదు. ఎన్ని విమర్శలు, ఆందోళనలు వస్తున్నా అమెరికా ప్రభుత్వం మాత్రం వారిని సంకెళ్లతోనే బంధించి సైనిక విమానాల్లో తరలిస్తోంది. ఈ విషయాన్ని స్వదేశం చేరకున్న భారత వలసదారులు స్వయంగా తెలిపారు. ‘డిపోర్టేషన్’లో భాగంగా 116 మంది భారతీయులతో కూడిన రెండో విమానం శనివారం రాత్రి అమృత్‌సర్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. ఇందులో హౌషియార్‌పుర్ జిల్లా కురలా కలాన్‌కు చెందిన దిల్జిత్ సింగ్ అనే వ్యక్తి.. అమెరికా ప్రయాణం గురించి మీడియాతో మాట్లాడాడు. తిరిగి వచ్చే సమయంలో అమెరికా అధికారులు వ్యవహరించిన తీరును వివరించారు. కాళ్లకు గొలుసులు, చేతులకు సంకెళ్లు వేశారని తెలిపారు. విమానం అమృత్‌సర్‌లో ల్యాండ్ అయ్యే ముందు సంకెళ్లను తొలగించారని అని దిల్జిత్ సింగ్ పేర్కొన్నారు. మహిళలకు మాత్రం సంకెళ్లు వేయలేదని తెలిపారు.
ఈ నెల 5న మొదటిగా వచ్చిన విమానంలోనూ 104 మంది వలసదారులకు చేతికి సంకెళ్లుగొలుసులతో బంధించి తీసుకొచ్చారు. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చినా అమెరికా పాలకుల బుద్ధి మారలేదు. అమెరికా నుంచి శనివారం వచ్చిన సి-17 విమానంలో 116 మంది వలసదారుల్లో 65 మంది పంజాబ్‌కు చెందినవారు, 33 మంది హర్యానాకు చెందినవారు, ఎనిమిది మంది గుజరాత్‌కు చెందినవారు, ఉత్తరప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్‌కు చెందిన ఇద్దరు చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు ఒక్కొక్కరు ఉన్నారని అధికారులు తెలిపారు.
భారత్ చేరుకున్న మూడో విమానం
సరైన పత్రాలు లేని వలసదారులతో అమెరికా నుంచి బయలుదేరిన మూడో విమానం కూడా భారత్‌కు చేరుకుంది. ఆదివారం రాత్రి అమృత్‌సర్‌లో ల్యాండయిన ఈ విమానంలో 112 మంది భారతీయులు ఉన్నారు. వీరిలో 44 మంది హర్యానా, 31 మంది పంజాబ్‌కు చెందిన వారు. అలాగే 33 మంది గుజరాత్‌కు చెందిన వారు. ఇద్దరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు ఉండగా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి చెరో ఒకరు ఉన్నారు.