ఆర్థిక చోదకశక్తిగా చైనా

Dec 11,2024 07:41 #A global economy, #China

ప్రపంచ ఆర్థిక సంస్థల అధినేతల సమావేశంలో జిన్‌పింగ్‌
బీజింగ్‌ : ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను ఈ ఏడాది కూడా సాధించడం ద్వారా ప్రపంచ ఆర్థికాభివృద్ధికి అతిపెద్ద చోదకశక్తిగా తాము నిలవనున్నామని చైనా అధ్యక్షుడు సీ జిన్‌పింగ్‌ పేర్కొన్నారు. ప్రధాన అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అధినేతలతో మంగళవారం బీజింగ్‌లో నిర్వహించిన ‘1 ప్లస్‌ 10’ చర్చల సందర్భంగా ఆయన ప్రసంగించారు. న్యూ డెవలప్‌మెంట్‌ బ్యాంకు అధ్యక్షులు దిల్మా రౌసెఫ్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ క్రిస్టాలినా జార్జిజివివా, ప్రపంచ బ్యాంకు గ్రూప్‌ అధ్యక్షులు అజరు బంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) డైరెక్టర్‌ జనరల్‌ నగోజి ఒకొంజో ఐవెలా సహా పది అగ్రశ్రేణి ప్రపంచ ఆర్థిక సంస్థల అధినేతలు ఏకకాలంలో ఈ చర్చల్లో పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కమిటీ మూడో ప్లీనరీ సెషన్‌ దృష్టి సారించిన అంశాలను ఈ సందర్భంగా జిన్‌పింగ్‌ తెలియజేశారు. ప్రత్యేకించి చైనా ఇటీవల తీసుకొచ్చిన ప్రధాన విధానపర నిర్ణయాలను ఆయన ప్రస్తావించారు. 40 ఏళ్ల సుస్థిర, పురోగామి అభివృద్ధి అనంతరం చైనా అత్యున్నత నాణ్యతా ప్రమాణాలతో కూడిన అభివృద్ధి సాధించే లక్ష్యాలపై దృష్టి సారించిందన్నారు. ప్రపంచ వాణిజ్య ప్రగతిలో చైనా ఒక్కటే 30 శాతం వాటాతో చోదకశక్తిగా నిలిచిందన్నారు. బయట ప్రపంచానికి చైనా మరింతగా తలుపులు తెరవనుందన్నారు. వాణిజ్య రంగంలో మరిన్ని అవకాశాలు కల్పించి, ఆదాయాలు, లాభాలను ఇతర దేశాలతో కలసి పంచుకోవటానికి ఏమాత్రం వెనుకాడబోమని జిన్‌పింగ్‌ చెప్పారు. స్థిరమైన, ఆరోగ్యకరమైన, సుస్థిరాభివృద్ధి సాధించే క్రమంలో విభేదాల పరిష్కారానికి అమెరికా ప్రభుత్వంతో అర్థవంతమైన చర్చలకు, సహకార విస్తృతికి తాము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఇదే తరహాలో చైనాతో కలసి పని చేసేందుకు అమెరికా వైపు నుంచి కూడా కృషి జరగాలని చైనా కోరుకుంటుందన్నారు. వాణిజ్యం, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆంక్షలు, యుద్ధాలకు తావు లేదని, ఇందులో విజేతలంటూ ఎవ్వరూ ఉండరని చైనా అధినేత ఉద్ఘాటించారు. దశాబ్దకాలంగా తాము దిగ్విజయంగా చేపడుతున్న బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ) పురోగతి గురించి కూడా జిన్‌పింగ్‌ ప్రస్తావించారు.

➡️