China : బెదిరిస్తే బెదరం

Apr 11,2025 14:47 #China, #tariffs, #Trump Tariff, #US imports

ట్రంప్‌పై చైనా ఆగ్రహం
యుఎస్‌పై టారిఫ్‌లు 125 శాతానికి పెంపు
న్యూఢిల్లీ : అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ యుద్ధం రోజు రోజుకు తీవ్రమవుతోంది. ట్రంప్‌ భయపెడితే ఎవరూ బెదిరే వాళ్లు లేరని చైనా స్పష్టం చేసింది. బ్లాక్‌ మెయిళ్లకు తలగ్గమని మరోమారు తెలిపింది. అమెరికా వరుసగా టారిఫ్‌లను పెంచుతున్న వేళ చైనా కూడా అదే స్థాయిలో స్పందిస్తోంది. తాజాగా చైనాపై యుఎస్‌ సుంకాలను 145 శాతానికి చేర్చగా.. చైనా సైతం ఏమాత్రం తగ్గకుండా అమెరికాపై టారిఫ్‌లను 125 శాతానికి చేర్చింది. డొనాల్డ్‌ ట్రంప్‌ బెదిరింపులకు చైనా ఏమాత్రం బెదరడం లేదు. యుఎస్‌ చర్యలకు ప్రతి సవాళ్లను విసురుతోంది. గతంలో అమెరికా దిగుమతులపై సుంకాలను 84 శాతానికి పెంచగా.. తాజాగా దీన్ని 125 శాతానికి చేర్చింది. గత మార్చి వరకు చైనా వస్తువులపై అమెరికా 10 శాతం సుంకాన్ని విధించింది. ఇటీవల ట్రంప్‌ పలు దపాలుగా సుంకాలను క్రమంగా పెంచుతూ 145 శాతానికి చేర్చారు. మొత్తానికి ఈ పరస్పర సుంకాలతో ఇరు దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది.

యూరప్‌ కలిసి రావాలి : జిన్‌పింగ్‌
అమెరికాపై చర్యలపై ఇటీవలే భారత్‌కు స్నేహహస్తం అందించిన చైనా.. తాజాగా యూరప్‌ దేశాలు తమతో కలిసి రావాలిన కోరింది. అమెరికా టారిప్‌ విధానలపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ స్పందిస్తూ.. తమపై అమెరికా విధించిన 145 శాతం సుంకాలను ఏకపక్ష బెదిరింపుగా ఉన్నాయని అన్నారు. బెదిరింపులను ప్రతిఘటించడానికి యూరోపియన్‌ యూనియన్‌ తమతో కలిసిరావాలని కోరారు. బీజింగ్‌లో స్పెయిన్‌ ప్రధాని పెడ్రో సాంచెజ్‌తో భేటీ సందర్బంగా షీ జిన్‌పింగ్‌ మాట్లాడుతూ.. చైనా, యూరప్‌ తమ అంతర్జాతీయ బాధ్యతలను నెరవేర్చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. అప్పుడే తమ సొంత చట్టబద్ధ హక్కులు, ప్రయోజనాలను కాపాడుకోవడానికి వీలవుతుందని పేర్కొన్నారు. అదే విధంగా అంతర్జాతీయ పారదర్శకత, న్యాయాన్ని కాపాడొచ్చన్నారు.

తుది వరకు పోరాటం
అమెరికా సుంకాల యుద్ధమే చేయాలని భావిస్తే తాము తుది వరకు పోరాడతామని చైనా స్పష్టం చేసింది. అమెరికా చర్చలకు రావాలంటే తమ తలుపులు తెరిచే ఉంటాయని పేర్కొంది. తాము ఘర్షణకు ప్రయత్నించబోమని, ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కోవడానికైనా వెనుకాడబోమని తెలిపింది. ‘చైనా వైఖరి స్పష్టంగా, స్థిరంగా ఉంది. కవ్వింపు చర్యలకు భయపడం. అమెరికా మాట్లాడాలనుకుంటే.. మా తలుపులు తెరిచే ఉంటాయి. కానీ పరస్పర గౌరవం, సమానత్వం ఆధారంగా చర్చలు జరగాలి. చైనాతో ఒప్పందం చేసుకోవాలంటే ఒత్తిడి, బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ వంటివి పనిచేయవు’ అని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రతినిధి హి యోంగ్కియాన్‌ అన్నారు.

➡️