బీజింగ్ : అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించడంలో యూరోపియన్ యూనియన్(ఇయు)తో కలిసి పనిచేసేందుకు సుముఖంగా వున్నట్లు చైనా పేర్కొంది. సహకారాన్ని పెంచుకునేందుకు ఇయు విశ్వసనీయమైన భాగస్వామిగా మారుతుందని ఆశిస్తున్నామని, దానితో సంబంధాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ బుధవారం పేర్కొన్నారు. ఇప్పటికే చైనా, కెనడా, మెక్సికో దేశాల దిగుమతులపై అదనపు సుంకాలు విధించిన ట్రంప్ ఇయు ఉత్పత్తులపై కూడా విధించే అవకాశాలు వున్నాయని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడితో చర్చలు జరపాలని భావిస్తున్నట్లు ఇయు వాణిజ్య చీఫ్ మంగళవారం తెలిపారు. ట్రంప్‌తో యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ జరపబోయే చర్చలేవీ అంత సాఫీగా జరగకపోవచ్చని భావిస్తున్నారు. ట్రంప్ టారిఫ్‌ల బెదిరింపులతో ఇయు సంబంధాలు కొంతమేర దెబ్బతింటున్న పరిస్థితుల్లో బీజింగ్, బ్రస్సెల్స్ మధ్య సంబంధాలపై పునరాలోచన చేయాలని ఉర్సులా వాన్ డెర్ లేయన్ వంటి వారు యోచిస్తున్నారు. రష్యాతో చైనా సంబంధాలు, వాణిజ్యపరమైన ఉద్రిక్తతల కారణంగా ఇయు, చైనా సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి. మంగళవారం బ్రస్సెల్స్‌లో లేయన్ మాట్లాడుతూ, చైనాతో సంబంధాల్లో ఉద్రిక్తతలు తగ్గించుకోవడానికే ఇయు చూస్తుందని చెప్పారు. వాణిజ్య, పెట్టుబడుల సంబంధాలను విస్తరించుకోవడానికి, ఒప్పందాలు కుదుర్చుకోవడానికి కూడా అవకాశాలు వున్నాయన్నారు. ఆ ఒప్పందాలు ఏమిటన్న వివరాలు ఆమె వెల్లడించలేదు. గతేడాది అక్టోబరులో చైనా తయారీ ఎలక్ట్రిక్ వాహనాలపై అప్పటికే వున్న సుంకాలకు అదనంగా ఇయు మరో 10శాతం సుంకాలు విధించింది. ఈ చర్యకు బీజింగ్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. దీంతో బ్రాందీ వంటి కొన్ని ఇయు ఉత్పత్తులు చైనా మార్కెట్‌లో ప్రవేశించడానికి అడ్డంకులను చైనా పెంచింది.
