మెక్సికో తదుపరి అధ్యక్షురాలి ఎన్నిక ప్రచారం విజయవంతం

మెక్సికో సిటీ : మెక్సికో తదుపరి అధ్యక్షురాలిగా పోటీ చేస్తున్న క్లాడియా షీన్‌బామ్‌ గత శుక్రవారం చేపట్టిన  ఎన్నికల ప్రచారం   విజయవంతమైంది.   సెంట్రల్‌ మెక్సికో సిటీలోని జకాలో ప్రజలతో నిండిపోయింది.  భారీ   ప్రదర్శనకు సంబంధించిన   దృశ్యాలు   మీడియాలో విడుదలయ్యాయి.   ‘ ప్రెసిడెంట్‌ ’ అనే నినాదాలతో హోరెత్తించారు. నేషనల్‌ రీజనరేషన్‌ మూవ్‌మెంట్‌ (ఎంఒఆర్‌ఇఎన్‌ఎ), లేబర్‌ పార్టీ (పిటి), గ్రీన్‌ ఎకాలజిస్ట్‌ పార్టీ ఆఫ్‌ మెక్సికో (పివిఇఎం) ల సంక్షీర్ణ కూటమి ఈ భారీ ప్రదర్శన చేపట్టింది. మెక్సికో సిటీ మాజీ చీఫ్‌గా ఉన్న క్లాడియాను అత్యథిక శాతం మంది ఇష్టపడుతున్నట్లు ఓ సర్వే తెలిపింది.

ఈ ఎన్నికలు మార్పును కోరుకునేవారు, అవినీతి, నయాఉదారవిధానాలకు ప్రవేశపెట్టే వారికి మధ్య జరుగుతున్నాయని క్లాడియా పేర్కొన్నారు.  ఫోర్త్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ అమలుతో కనీస వేతనాలు రెట్టింపు అవుతాయని, అమెరికా సరిహద్దు ప్రాంతంలో మూడు రెట్లు పెరగవచ్చని   పేర్కొన్నారు. రోడ్లు, రిఫైనరీస్‌, విమానాశ్రయాలు, రైళ్లు, పవర్‌ ప్లాంట్స్‌ను నిర్మించవచ్చని అన్నారు. సోలార్‌, నూతన పాఠశాల పుస్తకాలను ప్రవేశపెట్టవచ్చని అన్నారు. దేశం రుణాల ఊబి నుండి బయటపడుతుందని అన్నారు.

తానుఎన్నికల్లో విజయం సాధిస్తే.. దేశాభివృద్ధి కోసం ‘నేషన్‌ ప్రాజెక్ట్‌ -100 పాయింట్స్‌’ ను ప్రవేశపెడతానని అన్నారు. ఇందులో భాగంగా 60 నుండి 64 ఏళ్ల వయస్సుగల మిలియన్‌ కంటే ఎక్కువ మంది మహిళలకు పెన్షన్‌ పంపిణీ చేసే నూతన పథకాన్ని రూపొందించినట్లు తెలిపారు. ప్రస్తుత విమానయాన సంస్థ మెక్సికానా డి ఏవియాసియోన్‌ అభివృద్ధితో పాటు మరిన్ని విమానాశ్రయాలను నిర్మిస్తామని ప్రకటించారు.

➡️