డబ్ల్యూఇఎఫ్‌ వార్షిక సదస్సు ప్రారంభం

  • భారత్‌ నుంచి భారీ బృందం

దావోస్‌ : స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఇఎఫ్‌) వార్షిక సదస్సు 2025 సోమవారం ప్రారంభమైంది. ఐదు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సుకు వివిధ దేశాల నాయకులు, అధికారులు, వ్యాపార వేత్తలు హాజరుకానున్నారు. ఈ సదస్సుకు తొలిసారిగా భారత్‌ భారీ బృందాన్ని పంపింది. భారత్‌ బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, మహారాష్ట్రల ముఖ్యమంత్రులు, వివిధ రాష్ట్రాలకు చెందిన అనేకమంది మంత్రులతోపాటు దాదాపు వంద మంది సిఇఓలు, ఇతర అధికారులు ఉన్నారు. సోమవారం ఈ సదస్సులో దక్షిణాఫ్రికా ఆర్థిక మంత్రి ఎనోచ్‌ గోడోంగ్వానా మాట్లాడుతూ ‘దక్షిణాఫ్రికాలో ఆర్థిక వృద్ధి రేటును పెంచడానికి నిర్మాణాత్మక సంస్కరణల అమలుపై దృష్టి కేంద్రీకరించినట్లు’ తెలిపారు. అమెరికా నూతన అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ నెల 23న వర్చువల్‌గా ఈ సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉక్రెయిన్‌ అధ్యక్షులు జెలెన్‌స్కీ ఈ నెల 21న సమావేశానికి హాజరై ప్రసంగిస్తారని డబ్ల్యూఇఎఫ్‌ నిర్వాహకులు తెలిపారు. డబ్ల్యూఎఫ్‌ ఇటీవల నిర్వహించిన సర్వేలో ఆర్థిక అభివృద్ధికి సాయుధ పోరాటాలు, వాతావరణ మార్పులు విఘాతంగా మారతాయని సర్వే తెలిపింది. అమెజాన్‌కు నిరసన సెగ దావోస్‌లో అమెజాన్‌ సంస్థకు వాతావరణ ఉద్యమ కార్యకర్తల నుంచి నిరసన సెగ తగిలింది. అమెజాన్‌ బేస్‌కు కార్యకర్తలు పచ్చ రంగు పులిమారు. అమెజాన్‌ హెలికాప్టర్లు ల్యాండింగ్‌కు అంతరాయం కలిగించారు. వెంటనే స్విస్‌ పోలీస్‌లు రంగంలోకి దిగి నిరస నకారులను నిలువరించారు.

➡️