వరుస దాడుల కలకలం – అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వ్యాపారవేత్త మృతి

వాషింగ్టన్‌ (అమెరికా) : అమెరికాలో నివసిస్తున్న భారతీయ విద్యార్థులు, భారత సంతతికి చెందినవారు వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. వీధి గొడవలో గుర్తు తెలియని దుండగుడి చేతిలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త మృతి చెందారు. ఫిబ్రవరి 2న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వివిధ కారణాలతో ఆరుగురు మృతి చెందగా.. తాజాగా మరొకరు ప్రాణాలు కోల్పోయారు.

ఫిబ్రవరి 2న అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ దారుణ ఘటన జరిగింది. అమెరికా రాజధాని వాషింగ్టన్‌లోని జపాన్‌ రెస్టారెంట్‌ నుంచి బయటకు వచ్చి వీధిలో నడుచుకుంటూ వెళుతున్న భారతీయ అమెరికన్‌ వివేక్‌తో గుర్తు తెలియని దుండగుడు వాగ్వాదానికి దిగాడు. వెంటనే దాడి చేశాడు. వివేక్‌ను కిందపడేసి ఆపై పేవ్‌మెంట్‌ కేసి తలను బాదాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునేసరికి బాధితుడు స్పృహ కోల్పోయిపడి వున్నాడు. తీవ్రంగా గాయపడిన వివేక్‌ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటూ గురువారం మరణించాడు. మృతుడిని వర్జీనియాకు చెందిన భారత సంతతి యువకుడు వివేక్‌ తనేజాగా (41) గుర్తించారు. ఈ ఘటన వెనక కారణాలు తెలియరాలేదని పోలీసులు వెల్లడించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనా స్థలంలోని సీసీ టివి ఫుటేజ్‌ ఆధారంగా నిందితుడిని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ చెప్పిన వారికి 25 వేల డాలర్ల బహుమతిని ప్రకటించారు.

భారతీయులపై వరుస దాడులు….

అమెరికాలో ఇటీవల భారతీయులపై జరుగుతోన్న వరుస దాడులు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. గతవారం చికాగోలో హైదరాబాద్‌ యువకుడి సయ్యద్‌ ముజాహిర్‌ అలీపై దాడిచేసి దుండగులు దోచుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలయ్యింది. అలాగే, తెలంగాణకు చెందిన శ్రేయాస్‌ రెడ్డి బెనిగెర్‌ (19)తో పాటు నీల్‌ ఆచార్య, వివేక్‌ సైనీ (25), అకుల్‌ ధావన్‌, సమీర్‌ కమాథ్‌లు కూడా వేర్వేరు కారణాలతో మృతి చెందారు.

భారత్‌లోని అమెరికా రాయబారి స్పందన…

అమెరికాలో భారతీయుల వరుస మరణాలపై భారత్‌లోని అమెరికా రాయబారి ఎరిక్‌ గార్సెట్టి స్పందించారు. ఎవరి పట్ల అన్యాయం జరిగినా అమెరికా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. చదువుకునేందుకు, సురక్షితంగా ఉండేందుకు భారతీయ విద్యార్థులకు అమెరికా ఉత్తమమైనదని చెప్పారు. దీనిపై భరోసా కలిగించేందుకు అమెరికా ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని అన్నారు.

➡️